వైసీపీ రెబల్ ఎంపీ, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును గత ఏడాది మేలో అరెస్టు చేసిన వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రాజద్రోహం సెక్షన్ (124-ఏ)ను జగన్ దుర్వినయోగపరిచి రఘురామపై కక్ష తీర్చుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాజద్రోహం పేరుతో రఘురామను అరెస్టు చేయించిన జగన్..కస్టడీలో రఘురామను పోలీసులతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి.
రఘురామ అరికాళ్లకు అయిన గాయాల ఫొటోలు వైరల్ కావడం…న్యాయస్థానాలు కూడా దీనిపై వివరణ కోరడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది. ఈ క్రమంలోనే సీఐడీ ఆఫీసులో ఆ రాత్రి ఏం జరిగిందన్న విషయాన్ని రఘురామ పూసగుచ్చినట్టుగా కేంద్ర సిబ్బంది-ప్రజాసమస్యలు, న్యాయశాఖలకు చెందిన పార్లమెంటరీ కమిటీ సభ్యులతో పంచుకున్న లేఖలో గతంలోనే వెల్లడించారు.
గుంటూరులోని సీబీ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉంచారని, అర్ధరాత్రి పూట ఐదుగురు వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి తనను కొట్టారని రఘురామ ఆరోపించారు. వారు తన కాళ్లు కట్టేసి అరి కాళ్లపై లాఠీలతో, రబ్బరు బెల్టులతో బాదడం ప్రారంభించారని ఆరోపించారు. అరవకుండా తన నోట్లో గుడ్డలు కుక్కారని, తన ఛాతీపై కూర్చున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
దాదాపు ఐదు రౌండ్ల పాటు తనను హత్యచేయాలన్నంత కసిగా దాడి చేశారని, అత్యంత హేయమైన బూతు పదజాలంతో హెచ్చరించారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయడానికి నీకెంత ధైర్యమని ప్రశ్నిస్తూ హింసించారని ఆరోపించారు. రఘురామను కొడుతున్న వైనాన్ని సీఎం జగన్ వీడియో ద్వారా చూశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని తాను విమర్శించడంతో తన పట్ల వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని రఘురామరాజు గతంలోనే పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాసిన లేఖలో వివరించారు.
ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రధాని మోదీకి రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేశారని, కస్టోడియల్ టార్చర్ చేశారని ఆ లేఖలో ఆరోపించారు. అంతేకాదు, విచారణ అధికారులను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఇంకా పిలవలేదని పేర్కొన్నారు. తనను ఎవరు కొట్టారో ఇంకా విచారణే జరపలేదని, ఈ అంశంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.
తనను సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని, సీఎం జగన్ వీడియో ద్వారా దానిని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ జరిపించాలని రఘురామ కోరారు. ఆల్రెడీ బీజేపీతో అంటీ ముట్లనట్లుగా ఉంటున్న జగన్ కు రఘురామ తాజా లేఖ షాకిచ్చింది.