నాటకీయ పరిణామాల మధ్య సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తరలిస్తున్నారు. రఘురామకృష్ణరాజును ప్రత్యేక వాహనంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి ఏపీ సీఐడీ అధికారులు తరలిస్తున్నారు.
కానిస్టేబుల్ భుజాలపై చేతులు వేసి నడవలేని స్థితిలో అతి కష్టం మీద అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చిన రఘురామ కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యారు. తనకోసం జైలు దగ్గర వేచి ఉన్నవారికి రెండు చేతులెత్తి అభివాదం చేస్తూ కారు ఎక్కి సికింద్రాబాద్ బయలుదేరారు. భారీ భద్రత నడుమ రఘురామ కాన్వాయ్ బయల్దేరింది. రఘురామ వాహనానికి పోలీసు ఎస్కార్ట్ తో పాటు సీఆర్పీఎఫ్ బలగాల రక్షణ కూడా కల్పించారు.
ఈ రోజు రాత్రి 10 గంటలకు రఘురామ సికింద్రాబాద్ చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామ వైద్యపరీక్షల పై మెడికల్ బోర్డు ఏర్పాటు కానుంది. అయితే, రఘురామ ఆరోగ్యంపై ఆర్మీ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఎలా ఉండబోతోందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. రఘురామ అరికాళ్లకున్న గాయాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ నివేదిక కీలకం కానుంది.
రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ తరలించడంలో ఎన్నో ట్విస్టులున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా…ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పందించడంలో జాప్యం చేశారని ప్రచారం జరిగింది. అనంతరం, ఆదిత్యనాథ్ దాస్ కు రఘురామకృష్ణరాజు భార్య రమాదేవి ఫోన్ చేసి తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని వెల్లడించారు. అంతేకాదు, సీఐడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేయడంతో సీఎస్ వెంటనే స్పందించారు. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పారు. అప్పటి వరకు జాప్యం చేసే ధోరణిలో కనిపించిన ప్రభుత్వ వర్గాలు…రఘురామ భార్య రమాదేవి ఫోన్ చేయడంతో రఘురామను హైదరాబాద్ తరలించడం విశేషం.
మరోవైపు, రఘురామకృష్ణరాజు కేసు విచారణను వేసవి సెలవుల తర్వాతకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. రఘురామరాజును రమేష్ ఆసుపత్రి తరలింపు, అక్కడ వైద్య పరీక్షల నిర్వహణపై సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రఘురామ తరఫు న్యాయవాదులు సవాలు చేశారు. వారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టు ఈరోజే ఆదేశాలిచ్చినందున ఈ కేసును వేసవి సెలవుల తర్వాత విచారణ చేయాలని ఏఏజీ కోరారు. దీంతో.. విచారణను వేసవి సెలవుల తర్వాతకు హైకోర్టు వాయిదా వేసింది.