రాజ్యసభలో హీరోల రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవిపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడి చేస్తున్నారు. అయితే, చిరంజీవి చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని, అది తెలుసుకోకుండా వైసిపి నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు బాసటగా నిలిచారు.
చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, రాష్ట్రాన్ని రోడ్లను అభివృద్ధి చేయమని మాత్రమే చెప్పారని అన్నారు. అయితే, గుమ్మడికాయల దొంగ టైపులో తమ పార్టీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించకుండా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. అలా మాట్లాడిన విజయసాయికి బుద్ధుందా అని ప్రశ్నించారు. హీరోల స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందని అన్నారు.
జగన్ వేల కోట్లు సంపాదించారని ఆరోపణలు వస్తున్నాయని, ఆ మొత్తాన్ని 150 మంది ఎమ్మెల్యేలకు పంచమంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే దానిని పట్టించుకోకుండా బ్రో సినిమా కలెక్షన్లపై ఫిర్యాదు చేయడం ఏంటని మండిపడ్డారు. ఆ సినిమాలోని చిన్న క్యారెక్టర్ కు అంబటి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. అయితే, చిరంజీవి మాట్లాడిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పూర్తి వీడియో తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.
ఆ వీడియోలో చిరంజీవి రాజ్యసభలో విజయసాయిరెడ్డి రెమ్యూనరేషన్ ప్రస్తావన తేవడంపై మాత్రమే మాట్లాడారు.. అది చూసుకోకుండా చిరంజీవిని వైసీపీ నేతలు వరుసగా టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించడంపై సోషల్ మీడియా ట్రోలింగ్ జరుగుతోంది.