వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నీయాంశమైన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదనలు సర్వత్రా ఉత్కంఠ రేపాయి. అయితే, చాలామంది రాజకీయ విశ్లేషకులు ఊహించినట్టుగానే ముందస్తు బెయిల్ వ్యవహారంలో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై రెండో రోజు విచారణ కొనసాగించిన తెలంగాణ హైకోర్టు పిటిషన్ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు ఈ పిటిషన్ పై తీర్పు ఇవ్వలేమని బెంచ్ స్పష్టం చేసింది. వెకేషన్ బెంచిని మార్చుకుంటారా అంటూ ధర్మాసనం ఇరు పక్షాలను ప్రశ్నించింది. దీంతో, ఇది అర్జెంటు వ్యవహారం అని, తీర్పునివ్వాలని ఇరు పక్షాలు కోరాయి. అయితే, ఈ పిటిషన్ పై తీర్పు అత్యవసరమైతే చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించాలని న్యాయమూర్తి సురేంద్ర సూచించారు.
రేపటి నుంచి హైకోర్టుకు వేసవి కాలం సెలవులు కావడంతో వెకేషన్ తర్వాత తీర్పునిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అర్జెంట్ అయితే చీఫ్ జస్టిస్ ముందు అర్జెంట్ అని మెన్షన్ చేయాలని జడ్జి సురేంద్ర సూచించారు. ఈ రోజు ఇరుపక్షాల వాదనలు విన్నపటికీ తీర్పు ఇవ్వలేమని వెల్లడించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు ఇన్ని రోజులు రిజర్వ్ లో ఉంచితే బాగుండదని, ఈ విషయంలో సీబీఐ తన పని తాను చేసుకుని పోవచ్చని క్లారిటీ నిచ్చింది. ఏది ఏమైనా అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు లో మరింత జాప్యం జరగడంతో అవినాష్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఊరట లభించినట్లయింది.