కేంద్రంలోని మోడీ సర్కారుకు ఎదురుదెబ్బలు పడిన రైతు ఉద్యమానికి సంబంధించిన మరకలు ఇంకా వెంటాడుతున్నాయి. మోడీ సర్కారు పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు.. విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సంచలన ఆరోపణల్ని చేశారు ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే. మోడీ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున సాగిన రైతు ఉద్యమ వేళ.. తాము చెప్పినట్లుగా వినకుంటే ట్విటర్ ను భారత్ లో మూసేస్తామంటూ మోడీ సర్కారు తమకు వార్నింగ్ ఇచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
2020, 2021లో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించిన వేళ.. ట్విటర్ ఖాతాపై ఆంక్షలు విధించాలని మోడీ సర్కారు తమను ఆదేశించిందని ఆయన వ్యాఖ్యానించారు.‘తమ మాట వినకుంటే భారత్ లో ట్విటర్ ను మూసివేస్తామని హెచ్చరించారు. కొన్ని ఖాతాలపై ఆంక్షలు విధించాలని.. కొన్ని పోస్టులు తొలగించాలని చెప్పారు. అలా చేయకుంటే సంస్థను మూసి వేయటంతో పాటు.. ఉద్యోగులు ఇళ్లల్లో సోదాలు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించింది. మాపై ఒత్తిడి తెచ్చింది. భారత్ తో పాటు టర్కీ..నైజీరియా ప్రభుత్వాల నుంచి కూడా మాకు బెదిరింపులు వచ్చాయి’’ అంటూ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు.
ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే 2021లో ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తప్పుకోవటం తెలిసిందే. తాజాగా ఒక ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘భారతదేశం మాకు చాలా పెద్ద మార్కెట్. అలాంటి భారత్ లో ట్విటర్ ను మూసివేస్తామని మాకు స్పస్టంగా తెలియజేశారు. మీ ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తామన్నారు. చేశారు కూడా. ఇదీ ఇండియా. ఒక ప్రజాస్వామ్య దేశం’’ అంటూ బ్రేకింగ్ పాయింట్స్ అనే యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ట్విటర్ నుంచి తొలగించాలంటూ మోడీ సర్కారు నిర్దేశించిన కంటెంట్ మొత్తం ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించే పలువురు జర్నలిస్టు ఖాతాల్లోనిదేనని డోర్సే వెల్లడించటం గమనార్హం. గతంలోకి వెళితే.. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. ఢిల్లీ శివారులో భారీ ఎత్తున ఉద్యమం జరగటం తెలిసిందే. ఆ సమయంలో ‘‘మోదీప్లానింగ్ఫార్మర్జీనోసైడ్’’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో బాగా పాపులర్ కావటం తెలిసిందే. దీంతో.. అప్పట్లో భారత ప్రభుత్వం అలాంటి రెచ్చగొట్టే అకౌంట్లను.. ట్వీట్లను తక్షణం అడ్డుకోవాలంటూ ట్విటర్ ను ఆదేశించింది. అందుకు తగ్గట్లే ట్విటర్ స్పందించి.. దాదాపు 250 అకౌంట్లను బ్లాక్ చేసింది.
అలా బ్లాక్ చేసిన వారిలో కారవాన్ మ్యాగజైన్ లాంటి సంస్థల ఖాతాలతో పాటు.. పలువురు ప్రముఖ జర్నలిస్టుల ఖాతాలు కూడా ఉన్నాయి. అయితే.. ఆ ఖాతాల్ని బ్లాక్ చేయటంపై పెద్ద ఎత్తున నిరసన రావటంతో.. అరు గంటల వ్యవధిలోనే ఖాతాల్ని మూసివేయటానికి తగిన ఆధారాలు లేవంటూ ఆ అకౌంట్లను పునరుద్ధించింది. దీంతో తమ ఆదేశాలను అమలు చేయకుంటే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. దీనికి ట్విటర్ స్పందిస్తూ.. మీడియా సంస్థలు.. పాత్రికేయులు.. సామాజిక కార్యకర్తలు.. రాజకీయ నేతల ఖాతాల్నిబ్లాక్ చేయమని స్పష్టం చేసింది. అలా చేస్తే.. వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది.
ఇది జరిగిన కొంతకాలానికి మోడీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందంటూ కాంగ్రెస్ టూల్ కిట్ పేరుతో బీజేపీ నేతలు పెట్టిన ట్వీట్లకు ట్విటర్ మ్యానిపులేటెడ్ మీడియా అని ట్యాగ్ చేయగా.. దాన్ని తొలగించాలని కేంద్రంలోని మోడీ సర్కారు కోరింది. అందుకు ట్విటర్ నో చెప్పగా.. వీటికి సంబంధించిన నోటీసుల్ని ఇచ్చేందుకు పోలీసులు ట్విటర్ ఆఫీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగుల భద్రతపై ట్విటర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదంతా జరిగిన గతం. ఆ రోజుల్లోఏం జరిగిందన్న విషయాన్ని ట్విటర్ మాజీ సీఈవో తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ నేపథ్యంలో ట్విటర్ మాజీ సీఈవో చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ట్విటర్ ను ఎవరూ బెదిరించలేదని పేర్కొంది. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. డోర్సే హయాంలో ట్విటర్ కు భారత చట్టాల సార్వభౌమాధికారాన్ని అంగీకరించటంలో సమస్యలు ఉండేవని.. అప్పట్లో ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. ట్విటర్ ను మూసేయలేదని వ్యాఖ్యానించటం గమనార్హం. రైతుల నిరసనల సమయంలో ట్విటర్ లో విపరీతమైన దుష్ప్రచారం జరిగిందని.. నరమేధంలాంటివి చోటు చేసుకున్నాయని అసత్య ప్రచారాలు చేశారన్నారు.
2020 – 2022 నడుమ భారత దేశ చట్టాలు తమకు వర్తించవన్నట్లుగా ట్విటర్ వ్యవహరించిందని.. ఇలాంటివే అమెరికాలో జరిగితే మాత్రం ట్విటర్ అలాంటి ఖాతాల్ని తనంతట తానే తొలగించిందన్నారు. 2021లో ఐటీ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ సైతం.. డోర్సే ఆరోపణలపై స్పందిస్తూ.. ట్విటర్ ను ఎవరు బెదిరించలేదన్నారు. ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని కిందకు దించేసిన ఫుటేజీ పైనా.. పోలీసులను కొట్టే వీడియోలపైనా అభ్యంతరం తెలిపామన్నారు. అమెరికాలో కాపిటోల్ హిల్ మీద జరిగిన దాడికి అదేమీ తక్కువ కాదన్నారు. అమెరికాలో సున్నితంగా వ్యవహరించిన భారత్ ఇక్కడ మాత్రం ఎందుకు అలా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. డోర్సే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.