ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తాజాగా దాఖలు చేసిన మరో ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు ప్రస్తావించడం కలకలం రేపుతోంది. సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్, విజయ సాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి పాత్రను వివరించడం సంచలనం రేపుతోంది. బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, రుణ్పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు ఈడీ వివరించింది.
ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్స్‌కు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని, రామచంద్ర పిళ్లై వెనుక కవిత ఉన్నారని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తరఫున ప్రేమ్ రాహుల్ పనిచేస్తున్నారని ఈడీ వెల్లడించింది. 14,05,58,890 సీసాల మద్యం విక్రయించిన ఆ సంస్థ రూ.192.8 కోట్లు సంపాదించిందని పేర్కొంది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, కె.కవిత, శరత్‌రెడ్డిల నియంత్రణలో సౌత్‌గ్రూప్ ఉందని, రూ.100 కోట్ల ముడుపులను విజయ్నాయర్కు ఆ గ్రూప్ ఇచ్చిందని ఆరోపించింది. ఆప్ నేతలకు, సౌత్ గ్రూప్ నకు మధ్య కుదిరిన డీల్‌గా దానిని వెల్లడించింది. ఆ డీల్ ప్రకారమే 100 కోట్లను ముందస్తుగా చెల్లించినట్టు పేర్కొంది.
ఇండోస్పిరిట్లో 65 శాతం వాటా సౌత్‌గ్రూప్‌నకు ఇచ్చేందుకు ఆ వంద కోట్లు లంచం ఇచ్చారని, ఈ వాటాను అరుణ్పిళ్లై, ప్రేమ్‌రాహుల్ అనే బినామీలతో నడిపించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో పాత్ర ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారని, ఇందులో కవిత ఫోన్లు 10 ధ్వంసమయ్యాయని తెలిపింది. దీంతో, ఈ లిక్కర్ స్కామ్ లో మాగుంట, కవితలకు ఉచ్చు బిగుసుకున్నట్లయింది.