‘ది కశ్మీర్ ఫైల్స్’..దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.200 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు..ప్రధాని మోడీ మొదలు ఫిల్మ్ క్రిటిక్స్ వరకు అందరూ ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, ఈ చిత్రం భారతీయుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విమర్శలు కూడా గుప్పించారు.
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు సద్దుమణగక ముందే తాజాగా ఆ సినిమాపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవారు ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని చూడాలని సీతక్క చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వీక్షించిన సీతక్క తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అంతేకాదు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవారు ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని చూడాలని, భారత్ ను ఐక్యంగా ఉంచాలనుకునేవాళ్లు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూడాలని సీతక్క పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతోపాటు, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని సీతక్క అభిప్రాయపడ్డారు. దర్శకుడు రాజమౌళికి అభినందనలు తెలిపిన సీతక్క….సోదరులు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నమ్మశక్యంకాని రీతిలో నటించారని పొగడ్తలతో ముంచెత్తారు.