ఏపీలో కొత్త కేబినెట్ విస్తరణ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమకు మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీలో అసంతృప్త నేతలు తమ అసహనాన్ని బాహాటంగానే వెళ్లగక్కారు. మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డ ఆశావహులు, తమ మంత్రి పదవి నిలబెట్టుకుంటామని ఆశించి భంగపడ్డ మాజీ మంత్రులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలుచోట్ల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు..ఒక్కొక్కరిగా తమ నోరు విప్పుతున్నారు.
ఇన్నాళ్లు పార్టీని, పార్టీ అధినేతను పల్లెత్తు మాట అన్నా సహించని నేతలే…నేడు నేరుగా పార్టీపై, జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు మంత్రి పదవి దక్కకపోవడం సొంత పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా అధిష్టానం అడ్డుకుందని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తాంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో గ్రామ వార్డు వాలంటీర్ సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని, ఇది జనాలకు సేవ చేసే ఒక సైన్యం లాంటిదని అన్నారు. సీఎం ఆశయం నెరవేరాలంటే వాలంటీర్ల వ్యవస్థ కీలకమన్నారు.
ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన బాబూరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మాట కోసం తాను వైసీపీలో చేరానని.. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆ పార్టీలో జాయిన్ అయ్యాయని చెప్పారు. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని.. అయితే తనను అమాయకుడిగా భావించి నేడు మంత్రి పదవి ఇవ్వలేదని జగన్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను అమాయకుడిని కాదని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని షాకింగ్ కామెంట్లు చేశారు. మంత్రి పదవి రాకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తాను కూడా అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొడతానని అన్నారు.