మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క మోడల్ కు మిస్ యూనివర్స్ కావాలన్నది ఓ కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు పలు దేశాల మోడళ్లు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తుంటారు. అయితే, విశ్వ సుందరి కావడానికి అందంతో పాటు కాసింత అదృష్టం…మరికొంత ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. అలా అందం, అభినయం, అదృష్టం, ఆత్మవిశ్వాసం ఉన్నవారికే ఆ ప్రతిష్టాత్మక కిరీటం దక్కుతుంది.
ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే…మెక్సికో అందం ఆండ్రియా మెజా `మిస్ యూనివర్స్-2020` కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో విజయం సాధించి నయా విశ్వ సుందరిగా ప్రశంసలందుకుంటోంది. 73 మంది పోటీదారులను వెనక్కు నెట్టి మెజా టైటిల్ ను దక్కించుకోవడం విశేషం. మిస్ యూనివర్స్ కిరీటాన్ని ధరించిన మూడో మెక్సికన్ మెజా.
`మన ప్రవర్తన కూడా మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దు` అంటూ మెజా ఆత్మవిశ్వాసంతో చెప్పిన సమాధానానికి న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మెజా…కేవలం మోడలింగ్ కే పరిమితం కాలేదు. మహిళా హక్కుల కోసం, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోన్న మోజాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోటీలో తొలి రన్నరప్‌గా మిస్ బ్రెజిల్ జులియా గామా, రెండో రన్నరప్‌గా మిస్ పెరూ జానిక్ మెసెటా డెల్ కాసిలో నిలిచారు. మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో 3వ రన్నరప్ గా నిలిచింది.