రాష్ట్రంలో మూడు రాజధానుల విషయం ఇప్పటికీ అధికార పార్టీ నేతల మధ్య నానుతూనే ఉంది. నాయకులు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా.. తమ అధినేత జగన్ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు. సమయం, సందర్భం చూసుకుని ఆయన దీనిపై నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నారు. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టుల్లో కేసులు ఉన్నాయి. పైగా.. హైకోర్టు అమరావతినే అభివృద్ధి చేసి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు ఈ నేపథ్యంలో సరికొత్త అంశం తెరమీదికి వచ్చింది.
ప్రభుత్వ పెద్దలు కొన్నాళ్లుగా.. మూడు రాజధానులకు ప్రజల్లో మంచి స్పందని ఉందని.. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. మూడు రాజధానులను అడ్డుకునే వారిని అభివృద్ధి నిరోధకులుగా కూడా చెబుతున్నారు. అయితే. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
గత ఆరు మాసాల కిందట అమరావతి నుంచి తిరుపతి వరకు రాజధాని రైతులు మెగా పాదయాత్రను నిర్వహించారు. మొత్తం నాలుగు జిల్లాల మీదుగా జరిగిన ఈ యాత్రకు ప్రజల నుంచిస్పందన వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటివారు వచ్చి.. రాజధాని రైతుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ పరిణామం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇక, మూడు రాజధానులే కావాలని అనుకుంటే.. ఆయా జిల్లాల్లో ప్రజలు ఈ పాదయాత్రకు ఎలా బ్రహ్మరథం పట్టారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే.. దీనికి కూడా వైసీపీ నాయకులు విరుగుడు మంత్రం చెప్పారు. ఆ నాలుగు జిల్లాల్లో ఎందుకు ఉంటుంది.. ఉంటే కర్నూలు, విశాఖ చుట్టుపక్కలే సెంటిమెంటు ఉంటుందని అన్నారు. అయితే.. ఇప్పుడు రాజధాని రైతులు.. విశాఖను టార్గటె్ చేశారు.
తాజాగా వచ్చే సెప్టెంబరు 12వ తేదీ నుంచి అమరావతి టు అరసవిల్లి.. వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విశాఖ వరకు వారి పాదయాత్ర సాగనుంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు అడకత్తెరలో పడినట్టు అయింది. ఎందుకంటే.. కీలకమైన పాలనారాజధానిగా విశాఖను చేయాలని ప్రబుత్వ పెద్దలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ జిల్లా వరకు కూడా రైతులు పాదయాత్ర చేయడం ద్వారా.. తమ సత్తా నిరూపించాలని.. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలను కదిలించాలని భావిస్తున్నారు. వీరు అనుకున్నట్టు అక్కడ కూడాప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథంపడితే.. ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారోచూడాలి.
Comments 2