తెలంగాణలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ పై సీతక్క మరోసారి విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ దూషణలకు దిగుతున్నారని సీతక్క ఆరోపించారు. పదేళ్లు మంత్రిగా వెలగబెట్టిన కేటీఆర్ ప్రతిపక్షంలోకి రాగానే సంస్కారం, సభ్యత మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, కేటీఆర్ మాటలకు తగిన రీతిలో సమాధానం చెబుతామని, సీఎం కుర్చీని అవమనించేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులను పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తూ నటిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రైతులు ఘోరంగా ఓడించారని, అయినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని సీతక్క అన్నారు. ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. రైతులకు ఉచిత ఎరువులు, సన్నాళ్లకు 500 రూపాయలు బోనస్ వంటి హామీలను అమలు చేశామని చెప్పారు. పంట బీమా పథకం లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు.