జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు, టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వివిధ కేసులలో ఇరికించి తనను కేసీఆర్ సర్కార్ దాదాపు 74 రోజులపాటు జైల్లో పెట్టిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. టీఆర్ఎస్ తనను కక్ష సాధింపు ధోరణితో అనేక ఇబ్బందులకు గురి చేసిందని, లేనిపోని కేసులు పెట్టించి జైలుకు పంపిందని మల్లన్న గతంలో కామెంట్లు చేశారు.
ఆ తర్వాత తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మొదట్లో దూకుడుగా ఉన్న మల్లన్న…ఈ మధ్యకాలంలో దూకుడు తగ్గించారు. ఇకపై కేసీఆర్ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని మల్లన్న ఇటీవల మల్లన్న శపథం చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయడం తమ విధానం కాదని, ప్రజా చైతన్యం కోసంమే తమ పోరాటమని చెప్పిన మల్లన్న అన్న మాట ప్రకారమే విమర్శలకు దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తీన్మార్ మల్లన్నపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా మల్లన్న యూట్యూబ్ చానల్లో అసత్య ప్రసారాలు చేశారంటూ అజయ్ ఆరోపించారు. అంతేకాదు, తీన్మార్ మల్లన్నకు పువ్వాడ తరఫు న్యాయవాది రూ.10 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి అజయ్ ప్రతిష్ఠకు భంగం కలిగేలా తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్ లో అబద్ధాలు చెప్పారని నోటీసులలో పేర్కొన్నారు.
బీజేపీకి చెందిన మల్లన్న జర్నలిజం ప్రమాణాలు పాటించకుండా మంత్రిపై అసత్య ప్రచారాలు చేసినందుకు సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసులిచ్చారు. లేదంటే వారం రోజుల్లో మంత్రి పువ్వాడ అజయ్ కు క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మల్లన్న మరోసారి మంత్రులు, కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు గుప్పిస్తారా లేదంటే ఇచ్చిన మాట ప్రకారం వారిపై విమర్శలు చేయకుండా చట్టప్రకారం ప్రొసీడ్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.