ఏపీ ఖజానా నిండుకుందని, నెలనెలా 1వతేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేందుకు కూడా జగన్ నానా తిప్పలు పడుతున్నారని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేసిన జగన్….నిధుల కోసం కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర జగన్ అడుక్కుంటున్నారని ప్రశాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని గతంలో ఎద్దేవా చేసినవారే… ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో ఆర్థిక శాఖ నడవాలంటే కేంద్రం నిధులు తప్పనిసరిగా కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో ఆ పరిస్థితి లేదని అన్నారు. అందుకే, కేంద్రం చెప్పినట్లు జగన్ చేస్తున్నారని, కేంద్రం ఒత్తిడి వల్లే రైతుల వ్యవసాయ మోటార్లకు ఉచిత కరెంట్ కోసం కొత్త మీటర్లు బిగించిందని చెప్పారు.
దేశం మొత్తం రైతుల మోటార్లకు మీటర్లను బిగించాలన్నది మోదీ ఆలోచన అని, కానీ, తెలంగాణలో మాత్రం అది జరగదని తేల్చి చెప్పారు. రైతులను కేంద్రం చాలా మోసం చేస్తోందని, బీజేపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకోవాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ రెడ్డి కామెంట్లపై ఏపీ సమాచార ప్రసార శాఖ, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని స్పందించారు.
తమకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామని పేర్ని నాని అన్నారు. అయితే, మాటిమాటికి ఏం బిచ్చమెత్తుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మాటల యుద్ధంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో వరి కొనుగోళ్ళపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంటే ఈ కొత్త గొడవేంటని నెటిజన్లు అంటున్నారు. ఏపీ, తెలంగాణలో పలు కీలక విషయాలను పక్కదారి పట్టించేందుకే ఈ తరహా విషయాలను తెరపైకి తెస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.