ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో అమరావతి చుట్టూ చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతే అంటూ ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన భవనాల నిర్మాణాల్లో పెరిగిపోయిన చెత్త చదరాలను, పిచ్చి మొక్కలను తొలగించే పనిలో గత వారం రోజుల నుంచి అధికార యంత్రాంగం తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది.
ఇక ఇదే తరుణం లో అమరావతి నిర్మాణానికి డెడ్ లైన్ లాక్ అయింది. కేవలం రెండున్నర ఏళ్లలోనే అమరావతిని 90 శాతం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తాజాగా ఇదే విషయాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ మీడియాతో వెల్లడించారు. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని.. అమరావతినే తమ శాఖ తొలి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఖరారు చేసిన మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం సాగుతుందని తెలిపారు. మొత్తం మూడు ఫేజుల్లో అమరావతి పనులు పూర్తి చేస్తామన్నారు. ఫస్ట్ ఫేజ్లో సిటీ వర్క్స్ అన్నీ పూర్తవుతాయని, ఫేజ్ 2లో మెట్రో నిర్మాణం, రాజధాని కనెక్టివిటీ పనులు ఉంటాయని వెల్లడించారు. మొదటి దశ నిర్మాణం కోసం రూ. 48 వేల కోట్లు ఖర్చు అవుతుందని, మూడు దశలకు కలిపి లక్ష కోట్ల వరకు ఖర్చును అంచనా వేసామని చెప్పుకొచ్చారు.
అమరావతి మొత్తం 217చదరపు కిలోమీటర్లు కాగా.. అందులో 3వేల 600 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయన్నారు. రోడ్లతో పాటు అధికారుల నివాసాలు, సెక్రటేరియేట్ కోసం కట్టే ఐదు భవనాలు, అసెంబ్లీ రాజధాని నిర్మాణంలో మేజర్ పార్ట్స్ అని నారాయన వివరించారు. ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని కూడా నారాయణ హామీ ఇచ్చారు.