ఏపీ లో గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు, సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను డోర్ టు డోర్ అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతో కీలకంగా మారింది. ఒకానొక సమయంలో ఏపీ రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూనే తిరిగింది. వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వమే లేదన్న హైప్ తీసుకొచ్చారు.
అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఎటువంటి బాధ్యత అప్పగించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా వైసీపీ మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి బ్రేకులు పడ్డాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
దీంతో వాలంటీర్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వాలంటీర్లను రాజీనామా చేయొద్దని కూటమి అభ్యర్థులు కోరారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పది వేలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే వినలేదు. ఇప్పుడేమో వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారంటూ కొందరు వాలంటీర్లు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడమంటూ అభ్యర్థిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు పై మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన వాలంటీర్లతో ఇక పని లేదని.. వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఉన్న వాలంటీర్లతోనే పనిచేయించుకుంటామని పేర్కొన్నారు. జులై 1వ తేదీన లబ్ధిదారులకు ఇంటి దగ్గరే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల నుంచి పెద్ద ఎత్తున మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. అయినాసరే వారిని తిరిగి తీసుకునే అవకాశాలు లేవని మంత్రి డోలా తెలిపారు.