దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు అరెస్టుల పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని(వీరిలో ఇద్దరు ఏపీకి చెందినవారు) అరెస్టు చేసిన సీబీఐ తాజాగా ఢిల్లీలోని ఆప్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి గా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆదివారం విచారణకు హాజరువాలంటూ సీబీఐ నోటీసులివ్వడంతో అరెస్ట్ ఖాయమని అందరూ ఊహించారు.
అయితే.. వాస్తవానికి వారం క్రితమే సిసోడియాను సీబీఐ విచారణకు పిలిచింది. కానీ ఢిల్లీ బడ్జెట్ రూపకల్పనలో తాను తీరిక లేకుండా గడుపుతున్నానని, తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటల్లోగా హాజరుకావాలని సీబీఐ ఆదేశించిన విషయం తెలిసిందే.
అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా,.. సీబీఐ ఆయనను దాదాపు ఉదయం నుంచి 8 గంటల పాటు విచారించింది. అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది.
‘‘ ఆదివారం ఉదయం నేను సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతాను. ఈ దర్యాప్తునకు నేను సంపూర్ణంగా సహకరిస్తాను. లక్షలాది మంది బాలల ప్రేమాభిమానాలు, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. కొన్ని నెలలపాటు జైలులో ఉండాల్సి వస్తే నేను పట్టించుకోను’’ అంటూ సిసోడియా వ్యాఖ్యానించారు.
ఇక రాజ్‌ఘాట్ వద్ద మాట్లాడుతూ… తాను భగత్ సింగ్ అనుచరుడినన్నారు. తప్పుడు ఆరోపణలపై జైలుకు వెళ్ళడం తనకు చాలా చిన్న విషయమని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని సీబీఐ అరెస్టుచేసిన విషయం తెలిసిందే.