నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం మొదలు ఆయనను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించేవరకు థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామను గుంటూరు నుంచి మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి ఆర్మీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
గుంటూరులో కారులో ఎక్కిన రఘురామ తనకు అభివాదం చేస్తున్నవారికి ప్రతిగా అభివాదం చేశారు. ఈ సందర్భంగా చాలాసేపు రఘురామ తన మీసం మెలేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారు అద్దంపైన తన అరికాలును ఉంచి గాయాలను కూడా చూపించారు. తనను ఎలాగైనా జైలులో పెట్టి ఇబ్బందిపెట్టాలని చూసిన జగన్, సీఐడీ అధికారుల పాచిక పారలేదన్న ఉద్దేశంతోనే రఘురామ మీసం తిప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా ఈ రోజు ఉదయం ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి ఆధ్వర్యంలో ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడియోగ్రఫీ చేస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత రఘురామ మెడికల్ రిపోర్ట్స్ ను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రఘురామను ఎవ్వరూ కలడానికి అనుమతి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అంతకుముందు, మంగళవారం రాత్రి ఆసుపత్రి చెక్‌పోస్ట్ దగ్గర ఎస్కార్ట్ వాహనం దిగే సమయంలో నడవడానికి రఘురామ తీవ్ర ఇబ్బంది పడ్డారు. మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కే క్రమంలో నడవలేక అక్కడే కూలబడిపోయారు. దీంతో, వెంటనే స్పందించిన ఆర్మీ అధికారులు రఘురామకు సహకరించి ఆయనను అంబులెన్స్‌లో ఎక్కించారు. అప్పటికే ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్న రఘురామ కుటుంబ సభ్యులు సీఐడీ అధికారుల అనుమతి తీసుకొని రఘురామతో మాట్లాడారు.
న్యాయం గెలుస్తుంది.. ధైర్యంగా ఉండండి అని కుటుంబసభ్యులకు రఘురామ భరోసానిచ్చారు. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో రఘురామ మాట్లాడే ప్రయత్నం చేయగా..అందుకు అధికారులు అనుమతించలేదు. ఏపీలో తనకు ప్రాణహాని ఉందని రఘురామ వెల్లడించారు. ఈ సమయంలో ఏపీ నుంచి వచ్చిన రఘురామ అభిమానులు ఆర్మీ ఆస్పత్రి వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆర్మీ ఆస్పత్రి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.