ఆసక్తికర విషయాన్ని వెల్లడించిందో సర్వే నివేదిక. దేశంలో మహిళలు వలస వెళ్లటానికి కారణం ఏమిటన్న దానిపై అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా శాంపిల్ సేకరించారు. తాము సేకరించిన వివరాల్ని విశ్లేషించిన వారికి ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దేశంలో మహిళల వలసలకు ప్రధాన కారణం.. పెళ్లిళ్లుగా తేల్చారు. తాజాగా వెల్లడించిన నేషనల్ శాంపిల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
దేశంలోని 87 శాతం మంది మహిళలు వివాహాల కారణంగా వలస వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇంతకూ వలస అంటే ఏమిటి? దాన్ని ఏ రీతిలో నిర్వచించారు? అన్న అంశంలోకి వెళితే.. ఎవరైనా వ్యక్తి ఆర్నెల్లకు మించి తాను స్వస్థలంలో కాకుండా వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నట్లైయితే.. దానిని వలస కింద పరిగణిస్తారు. ఇదే తీరులో సర్వేను నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఇదే ప్రాతిపదికన తీసుకొని సర్వే చేయగా.. ఉద్యోగం.. విద్య.. ఉపాధి.. పెళ్లిళ్లు.. సామాజిక రాజకీయ కారణాల కారణంగా వలస వెళుతున్నట్లుగా తేల్చారు.
వలసల విషయంలో మహిళలు అత్యధికంగా పెళ్లిళ్ల కారణంగా భర్తతో కలిసి వెళ్లాలి కాబట్టి.. వలసల్లో మహిళలు అత్యధికంగా ఉంటున్నట్లు తేలింది. దేశంలోని 87 శాతం మహిళలు భర్తల కారణంగా వలసలకు వెళ్లాల్సి వస్తుందని తేల్చారు. పట్టణ ప్రాంతంలో ఇది 93.4 శాతం ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 71.5 శాతం మహిళలు వలస వెళ్లినట్లుగా స్పష్టం చేస్తున్నారు.
ఇక.. దేశంలోని రాష్ట్రాల వారీగా చూస్తే.. వలసలు అధికంగా ఉన్న రాష్ట్రాల్ని చూస్తే.. మొదటి స్థానంలో హిమాచల్ ప్రదేశ్.. రెండో స్థానంలో పంజాబ్ నిలిచింది. ఇక.. మూడోస్థానంలో కేరళ నిలవగా.. మహారాష్ట్ర నాలుగో స్థానంలో నిలిచింది. ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ ఐదో స్థానంలో నిలిస్తే.. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలవటం గమనార్హం. మొత్తంగా వలసలు అన్నవి మహిళల్లో ఎక్కువగా.. అది కూడా భర్తల కారణంగా ఉన్న ఊరిని వదిలిపెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని తాజా సర్వే స్పష్టం చేసింది.