టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన `మురారి` చిత్రం మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. క్రియేటిక్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వరరావు, ఎన్. దేవిప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన మురారి చిత్రం సుమారు 23 ఏళ్ల కిందట విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇకపోతే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో మురారి సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ ను కూడా షురూ చేసింది. అయితే రీ రిలీజ్ లోనూ మురారి రికార్డులు క్రియేట్ చేస్తోంది. మూడు రోజుల ముందే బుక్ మై షోలో ప్రీ సేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఈ కల్ట్ క్లాసిక్ మూవీ టికెట్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బెంగళూరు, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ అభిమానులు ఎగబడుతున్నారు. మంగళవారానికి బుక్ మై షోలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడవడంతో.. రీ రిలీజ్ కు ముందే అత్యంత వేగంగా రూ. కోటి వసూలు చేసిన చిత్రంగా మురారి నయా రికార్డును సెట్ చేసింది.
అలాగే రీ రిలీజ్ సినిమాల్లో రెండు సార్లు బుక్ మై షోలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం మహేష్ బాబుకి మాత్రమే సాధ్యమైంది. గత ఏడాది రీ రిలీజ్ అయిన బిజినెస్‌మ్యాన్ మూవీకి బుక్ మై షోలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడు కాగా.. ఇప్పుడు ఆ ఘనతను మురారి కూడా అందుకుంది. ప్రస్తుతం మురారి హవా చూసి ఇతర హీరోల అభిమానులు ఇదేం క్రేజ్ రా సామి అంటూ తలపట్టుకుంటున్నారు.