రాత్రి బస చేసిన ఎం నిడమానూరు గ్రామం నుండి శాస్త్రోక్తంగా జరిగిన పూజల అనంతరం ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమైన మహా పాదయాత్ర… కొండేపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలోని
కే ఉప్పలపాడు, చిర్రి కూరపాడు, భోజన విరామం అనంతరం… కందుకూరు నియోజకవర్గం, జరుగుమల్లి మండలం విక్కిరాలపేట చేరుకున్నది.
ఈ రోజు కూడా పాదయాత్ర అ ప్రారంభ సమయానికి, అటెండెన్స్ వేయించుకోవటానికి వరుణ దేవుడు వచ్చాడు. నాలుగు చినుకుల తర్వాత… దారి పొడవునా మొదలైన పూల వర్షం ధాటికి తట్టుకోలేక, పక్కకు తప్పుకున్నాడు.
మహా పాదయాత్ర ప్రారంభమైన అరగంటకే… చిరుజల్లులతో రోడ్డు మీద బురద….సమీప గ్రామాల ప్రజలతో పాదయాత్రలో జనం వరద.
కొండపి మండలం పెద్ద కండ్లగుంట గ్రామం రైతులు పన్నెండు వందల నేతి అరిసెలు ఈ రోజు కానుకగా ఇచ్చారు.
ఈరోజు మహా పాదయాత్ర లో అత్యంత స్ఫూర్తివంతమైన సంఘటన ఉప్పలపాడు లో జరిగింది.
గ్రామ ప్రారంభంలోనే, దళితవాడలో, అంబేద్కర్ విగ్రహం దగ్గర దాదాపు పదిహేను మంది దళితులు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని బ్యానర్ పట్టుకొని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.
నా చేత అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయించారు.
అమరావతి పరిరక్షణ ఉద్యమం ఒక కులానికి కాదని, అమరావతి పరిరక్షణ ఒక సామాజిక బాధ్యత అని వాళ్లు పేర్కొనడం చాలా చాలా సంతోషాన్నిచ్చింది.
వీరి చైతన్యానికి కారణమేంటని, పరిశీలన చేస్తే… ఈ సమీప గ్రామాలన్నీ ఒకప్పుడు ప్రగతిశీల ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మలు అని తెలిసింది.
ఉప్పలపాడులో ఓలేటి రామదాసు గారు అనే 75 ఏళ్ల యువకుడు, నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకొని, సంతోషంగా కౌగిలించుకున్నాడు. వెంకట కృష్ణ గారి డిబేట్ అంటే చాలా చాలా ఇష్టమని, రెండు గంటల సేపు అన్నీ మర్చిపోయి, ఆ డిబేట్ చూస్తానని, వెంకటకృష్ణ బంగారం అని ముసిముసి నవ్వులతో చెప్పాడు.
ఈ పెద్దాయన సంతనూతలపాడు మండలం లో వేములూరిపాడు గ్రామానికి ఐదు సార్లు సర్పంచిగా చేసాడని చెప్పినప్పుడు, ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది. నాతో నడిచిన అర్ధగంట సేపు, పంచాయతీరాజ్ చట్టాల గురించి, స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు గురించి, చాలా చాలా లోతైన అవగాహన తో మాట్లాడారు.
ఆ తర్వాత కాసేపటికి… నాతో నడుస్తున్న మిత్రులు, రోడ్డు పక్కన నిలబడి, సంఘీభావం తెలియజేస్తున్న ఒక పెద్దాయన దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని అని, తన సొంత భూమిలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టి, జగన్ చేత ఆవిష్కరించి, జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఎంతో కృషి చేశారని పరిచయం చేశారు.
ఆ పెద్దాయన ప్రస్తుత ప్రభుత్వం… ఎంత త్వరగా పోతుందా అని…. ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. రాజకీయ కారణాల వల్ల, బహిరంగంగా పాదయాత్రకు రాలేకపోతున్నాను చెప్పాడు.
మధ్యాహ్న భోజన అనంతరం… సాగుతూ సాగిన పాదయాత్రకు, ఆలేరు వంతెన మీద కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారి దంపతులు, ఇతర నాయకులు, హైదరాబాద్ నుండి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమైన కొంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పూలవర్షం తో విక్కిరాలపేట కు స్వాగతం పలికారు.
ఈరోజుతో మహా పాదయాత్ర 150 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది.
విక్కిరాలపేట లో ఈరోజు రాత్రి బస.
ఈరోజు మధ్యాహ్నం వరకు కొండేపి నియోజకవర్గం లోని గ్రామాల్లో జరిగిన మహా పాదయాత్ర ను శాసనసభ్యులు స్వామి గారు అద్భుతంగా సమన్వయం చేసి విజయవంతం చేశారు.
కొలికపూడి శ్రీనివాసరావు
https://www.youtube.com/watch?v=wwqhdmIO7N0