నవ్యాంధ్రలో ఎన్నికల సందడి మొదలైంది.. కానీ అభ్యర్థుల వెన్నులో వణుకు కూడా మొదలైంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించిన షెడ్యూల్ చూస్తే వారి గుండె గుభేల్మంటోంది. షెడ్యూల్ ప్రకటన తేదీ (మార్చి 16కు, పోలింగ్ తేదీకి నడుమ ఏకంగా 59 రోజులు ఉండటంతో.. అన్ని రోజులు ఖర్చుపెట్టడం సాధ్యమేనా అని అభ్యర్థులు కలవరపడుతున్నారు. దక్షిణాదిలో ఎన్నికలంటేనే నేతల ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి. గత ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక, డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైనవిగా ముద్రబడ్డాయి.
వందల కోట్ల రూపాయలు తనిఖీల్లో పట్టుబడినా.. వేల కోట్ల నగదు చేతులు మారింది. ఖర్చుపెట్టిన వారు, చూసినవారు కూడా బిత్తరపోయారు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే స్థాయిలో అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. షెడ్యూల్ వెలువడిన మార్చి 16 నుంచి పోలింగ్ జరిగే మే 13 వరకూ అనుచరులు, కార్యకర్తల్ని అభ్యర్థులు భరించాలి. రోజుకు కనీసం రూ.ఐదు లక్షల నుంచి సభలు, ఇతరత్రా కార్యక్రమాలను బట్టి 25-30 లక్షల వరకూ ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. అలా చెయ్యకపోతే వెంట నడిచేవారు జారిపోతారని భయం. భోజనాలు, వాహనాలు, డీజేలు, ఫ్లెక్సీలు, కళాకారులు…ఒకటా రెండా ప్రతి రోజూ ఖర్చు చేస్తూనే ఉండాలి.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో షెడ్యూల్‌కు (మార్చి 10) పోలింగ్‌కు(ఏప్రిల్ 11) మధ్య 33 రోజులు ఉంది. అప్పట్లో గెలుపు, ఓటమిపై టెన్షన్ తప్ప వేరే బాదరబందీలు లేవని వివిధ పార్టీల నేతలు అంటున్నారు. పోలింగ్ తర్వాత 53 రోజులకు ఫలితాలు వెలువడ్డాయి. అంత కాలం ఎదురుచూడటం అప్పట్లో తమకు ఇబ్బంది కలిగించలేదని చెబుతున్నారు. కానీ ఈసారి అలా కాదు. పోలింగ్‌కు ముందే 59రోజులపాటు డబ్బులు నీళ్లలా ఖర్చు చేయాల్సి రావడం మోయలేని భారమని అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతించే డబ్బు వారం రోజులకు కూడా సరిపోదని, కార్యకర్తల బైకులకు పెట్రోలు కొట్టించాలన్నా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ధర ఏపీలో ఉందని గుర్తుచేస్తున్నారు. వేసవి కావడంతో నీళ్ల బాటిళ్ల ఖర్చే తడిసి మోపెడవుతుందని.. ఇక మద్యం సంగతి చెప్పక్కర్లేదని.. ప్రచారం వేళ జగన్ బ్రాండ్లుప పోయాలన్నా.. ఆ లిక్కర్ ఏపీలో అత్యంత ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని కొందరు అంటున్నారు.
ఖర్చుపై ఎన్నికల కమిషన్ నిఘా..
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు లెక్కించడంపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు మొదలుకొని కార్యకర్తలకు బిర్యానీతోపాటు టిఫిన్, కాఫీ ఖర్చులు కూడా ఈ ఎన్నికల్లో కచ్చితంగా చెప్పి తీరాల్సిందే. గతంలో ఖర్చులు తక్కువ చూపించడంతోపాటు మద్యం లాంటివి లెక్కల్లోకి రానిచ్చేవారు కాదు. అటువంటి అవకాశం లేకుండా ఈ ఎన్నికల్లో ఈసీ ధరల జాబితాను రూపొందించింది. ఆ ధరల ప్రకారమే అభ్యర్థుల ఖర్చు లెక్కిస్తుంది. జెండాలు, ఫ్ల్లెక్సీలు, టీ షర్టులు, టోపీలే కాకుండా కార్యకర్త తాగే వాటర్ ప్యాకెట్, టీ, తినే స్నాక్స్, ప్రచారాల్లో బెలూన్ కూడా వదిలి పెట్టకుండా లెక్కించనుంది. ఎన్నికల కమిషన్ 2022లో పెంచిన ధరల ప్రకారం పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి 90లక్షల రూపాయలు, అసెంబ్లీ అభ్యర్థి 40లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు. కానీ ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని జనరల్ సీట్లలో 40కోట్లు ఖర్చు చేసినా అభ్యర్థులు గెలవడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు నగదుతో పాటు లిక్కర్, డ్రగ్స్ ఇతర రూపాల్లో రూ.250 కోట్లు సీజ్ చేశారు.
హైటెన్షన్ ఎన్నికలకు రెడీ
నవ్యాంధ్రలో విపక్షాలు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే… ఈసారి దాదాపు వారం ఆలస్యంగా ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. 2019లో తొలి విడతలో, ఏప్రిల్ 11వ తేదీనే ఏపీలో పోలింగ్ ముగిసింది. ఈసారి మాత్రం నాలుగో విడతలో… మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటే… జూన్ 4వ తేదీన ప్రజా తీర్పు వెల్లడి కానుంది. ప్రతి ఐదేళ్లకూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కానీ… ఈసారి జరుగుతున్నది ‘హైటెన్షన్ ఎలెక్షన్’గా విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన కేసులు, కక్షలతో సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ ఈ తరహా పాలన సాగించలేదు. దీంతో… కార్యకర్త నుంచి అధినేతదాకా విపక్ష టీడీపీలో కసిగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. షెడ్యూలు విడుదలైన సమయానికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. షెడ్యూలుకు… పోలింగ్ తేదీకి మధ్య 52 రోజుల గడువు ఉంది. దీంతో… వ్యూహ ప్రతివ్యూహాలకు, విస్తృత స్ధాయి ప్రచారానికి తగినంత గడువు లభించినట్లయింది.
ఖరారైన పొత్తులు… అభ్యర్థులు
షెడ్యూల్ విడుదలయ్యే సమయానికే రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది. టీడీపీ, జనసేన మధ్య అంతకు ముందే పొత్తు కుదరగా… తాజాగా బీజేపీ కూడా వారితో జతకట్టింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. కలిసి ప్రయాణం చేయాలనుకున్న వెంటనే… ఆ పార్టీల మధ్య శరవేగంగా సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. ఎవరెవరు ఎక్కడ పోటీచేయాలనే అంశంపై అంగీకారం కూడా కుదిరింది. ఒకటి రెండు సీట్లలో ఆఖరు క్షణంలో ఏవైనా మార్పులు జరిగితే తప్ప ఈ పార్టీల మధ్య ఇవే సీట్లు కొనసాగే అవకాశం ఉంది. ఈ సర్దుబాటుకు అనుగుణంగా టీడీపీ ఇప్పటికే 128 అసెంబ్లీ సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీ పదహారు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అధికార పక్షం వైసీపీ 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది.
జోరుగా ప్రచార హోరు…
అభ్యర్థుల ఎంపికపై చాలా రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రధాన పార్టీలు ఎప్పుడో ప్రచార భేరి మోగించాయి. ‘రా… కదలిరా’ పేరుతో చంద్రబాబు రాష్ట్రంలోని పాతిక లోక్‌సభ స్థానాల పరిధిలో ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించారు. ఆయన కుమారుడు లోకేశ్ ‘శంఖారావం’ పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి వారిని ఉత్సాహపరుస్తున్నారు. టీడీపీ చరిత్రలో మొదటిసారిగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఈసారి ప్రచార రంగంలోకి దిగారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. మూడు పార్టీల పొత్తు తర్వాత మార్చి 17న చిలకలూరిపేట సమీపంలో ప్రజాగళం పేరిట ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించారు.
దీనికి ప్రధాని మోదీ కూడా హాజరై జగన్ సర్కారుపై విమర్శల దాడి చేశారు. మరో వైపు అధికార పక్షం వైసీపీ కూడా ‘సిద్ధం’ పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించింది. జగన్ కూడా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అధికారం అండ, వనరులు దండిగా ఉండటంతో వైసీపీ నేతలు ఇప్పటికే వివిధ వర్గాల వారిని కానుకలతో ముంచెత్తుతున్నారు. వలంటీర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దాకా ఎవరినీ వదలకుండా కుక్కర్లు, ప్లాస్కులు, చీరలు, నగదు పంచుతున్నారు. మరోపక్క జగన్ మేనత్త విమలా రెడ్డి క్రైస్తవ మత ప్రభోదకుల సమావేశాలు పెట్టి వారికి కానుకలు, వసా్త్రలు, నగదు పంపిణీ చేయిస్తున్నారు. రాష్ట్ర విభజన పరిణామాల్లో రాష్ట్రంలో కుప్పకూలిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల సమయానికి ఉత్సాహంతో ముందుకు వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా చేయడం… అన్నపై ఆమె విరుచుకుపడుతుండటంతో ఆ పార్టీ కార్యక్రమాలకు ఆకర్షణ పెరిగింది. వామపక్షాలు కూడా కాంగ్రెస్‌తో జట్టు కడుతున్నాయి.
పురోగతా… పథకాలా?
ఈసారి పోరు కీలకమైన అంశాలతో మోతెక్కనుంది. అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో అధికార పక్షం కేవలం ‘బటన్‌నొక్కుడు’నే నమ్ముకుని జనంలోకి వెళ్తోంది. టీడీపీ దీనికి భిన్నంగా ‘అభివృద్ధి – సంక్షేమం’ రెండూ తమతోనే సాధ్యమని ప్రచారం చేస్తోంది. జగన్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందని, మళ్లీ తాము వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటుందని ఆ పార్టీ చెబుతోంది. ‘సూపర్ సిక్స్’ పేరుతో కొత్త పథకాలను ప్రచారంలో పెట్టింది. బీజేపీని కలుపుకోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇతోధికంగా సాయం అందుతుందని కూడా ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వలంటీర్లు, పోలీసులు, అధికార యంత్రాంగాన్ని వైసీపీ వాడుకొనే ప్రయత్నం చేస్తుండగా… కౌరవులు ఎందరున్నా పాండవులదే విజయమని టీడీపీ కూటమి బలంగా ముందుకెళుతోంది.
ఓటర్లు 4,09,37,352
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,09,37,352. అందులో పురుషులు 2,00,84,276 మంది, మహిళలు 2,08,49,730 మంది, ట్రాన్సజెండర్లు 3,346 మంది ఉన్నారు. ఎనఆర్‌ఐ ఓటర్లు 7,763 మంది, సర్వీసు ఓటర్లు 67,393 మంది, 18-19 సంవత్సరాల మధ్య ఓటర్లు 9,01,863 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 5,17,140 మంది, 85 ఏళ్లు పైబడినవారు 2,12,237 మంది ఉన్నారు. 2024 జనవరి ఓటర్ల తుది జాబితాలో 4 కోట్లా 7 లక్షల మంది ఓటర్లు ఉండగా, నెలన్నర రోజుల నుంచి కొత్తగా 1 లక్షా 75 వేల మంది ఓటర్లు పెరిగారు. 46 వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసరంగా మరికొన్ని పోలింగ్ కేంద్రాలను పెడుతున్నారు. అర్బనలో 12,045 పోలింగ్ స్టేషన్లు, రూరల్‌లో 34,120 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఈసారి పోలీసు సిబ్బంది గాక 3,82,218 మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 85 ఏళ్లు నిండిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన వచ్చాక ఫామ్-12 ద్వారా రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని పోస్టల్ బ్యాలెట్‌గా గుర్తిస్తారు. 10 రోజుల ముందే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటారు.
ఎన్నికల వేళ ఉద్యోగులపై జీవోల వర్షం
జగన ప్రభుత్వం ఐదేళ్ల అధికారంలో ఉద్యోగులకు పెద్దగా ఒరగబెట్టింది ఏమీలేదనే విమర్శలున్నాయి. అయితే, ఎన్నికల కోడ్ ముందు రోజైన శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం రెండు పెండింగ్ డీఏలకు సంబంధించిన జీవోలు ఇచ్చింది. శనివారం ఎన్నికల కోడ్ మరికొన్ని గంటల్లో అమల్లోకి వస్తుందనగా… మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. గత ఐదేళ్లుగా ఉద్యోగ సంఘాలు అడుగుతున్న వెసులబాట్లను ఇవ్వకుండా, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా జీవోలు ఇచ్చి చేతులు దులుపుకొంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా ఉద్యోగులకు ఇస్తున్న పిల్లల సంరక్షణ సెలవులను ఉద్యోగి పిల్లలకు 18 సంవత్సరాల వయసులోపే వాడుకోవాలన్న నిబంధనలను సడలించి ఉద్యోగి సర్వీసు కాలంలో ఎప్పుడైనా వాడుకునే అవకాశం కల్పిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిధంగా కొత్తగా సర్వీసులో చేరిన మహిళా ఉద్యోగులు వారి ప్రొబేషన పీరియడ్లోపు.. అనగా రెండు సంవత్సరాల లోపు ప్రభుత్వం ప్రకటించిన ఆరు నెలల ప్రసూతి సెలవులను వాడకుంటే అంతకాలంపాటు వారి ప్రొబేషన ప్రకటన వాయిదా పడి, తోటి వారి కన్నా జూనియర్ అయిపోయి, పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని పలుమార్లు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఏపీ జేఏసీ అమరావతి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మొత్తుకున్నాయి. ఆ సమస్యనూ పరిష్కరిస్తూ ఆరు నెలలు ప్రసూతి సెలవులను ప్రొబేషన పీరియడ్లోపు మహిళా ఉద్యోగి వాడకుంటే సదరు కాలాన్ని డ్యూటీ పీరియడ్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఇలా కూసిందో లేదో.. ఆంధ్రప్రదేశ విద్యుదుత్పత్తి సంస్థల్లో బదిలీలు పరుగులెత్తాయి.
బదిలీలపై నిషేధం ఎత్తివేయకపోయినా, ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేయకపోయినా, అర్ధంతరంగా.. ఆకస్మికంగా జెన్కో యాజమాన్యం హడావుడిగా 14 మంది ఇంజనీరింగ్ ఉద్యోగులను బదిలీ చేసేసింది. దీనిపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అలాగే సర్కారు కరువు మండలాలపై డ్రామాకు తెరతీసింది. కరువు, చంద్రబాబు కవల పిల్లలంటూ హేళన చేసిన వైసీపీ నేతలు.. తమ పాలనలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం రాదని ప్రగల్భాలు పలికారు. అయితే 2023 ఖరీఫ్‌లో 448 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడగా, 103 కరువు మండలాలు ప్రకటించిన జగన సర్కారు.. తాజాగా 2023-24 రబీ సీజన కింద 87 కరువు మండలాలను ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల తీవ్ర వర్షాభావం నెలకొన్న ఆరు జిల్లాల్లోని 87 మండలాలతో కరువు ప్రభావిత మండలాల జాబితాను కోడ్ అమలులోకి వచ్చేముందు విడుదల చేసింది.
నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 63 తీవ్రమైన కరువు మండలాలుగా, 24 ఒక మోస్తరు కరువు మండలాలుగా గుర్తించింది. ఈశాన్య రుతుపవనాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 400.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కనీసం 302.6మి.మీ. వాన పడాల్సి ఉంది. కానీ గత అక్టోబరు నుంచి ఈ నెల మొదటివారం వరకు కేవలం 232.7 మి.మీ. మాత్రమే కరిసినట్లుగా నమోదైంది. డిసెంబరులో మిచౌంగ్ తుఫాన సంభవించి, 22 జిల్లాల్లో 6.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కానీ తుఫానకు ముందు, తర్వాత సీజన ముగిసే వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో దాదాపు అత్యధిక మండలాల్లో వాన జాడ లేక, తీవ్ర వర్షాభావం కొనసాగింది. ఉత్తర, మధ్య కోస్తాలోనూ పెద్దగా వర్షాలు పడలేదు. అయినా కూడా 6 జిల్లాల్లోని 87 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడంపై మిగతా మండలాల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోడ్ అమలులోకి వచ్చే ముందు రైతులను మభ్యపెట్టడానికే రబీ కరువు మండలాలను ప్రకటించినట్లు విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.