టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలో హలో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్…యువత అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అంతేకాదు, ఈ సందర్భంగా రాజకీయాలపై, వ్యక్తిగత విషయాల గురించి లోకేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలనుకునే వారంతా రాజకీయ అరంగేట్రం చేయాలని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లోకేష్ ఆకాంక్షించారు. రాజకీయాల్లో కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే పవన్ కల్యాణ్ లో ఆ మంచి మనసును చూశానని లోకేష్ వెల్లడించారు.తాను మెగాస్టార్ అభిమానినని, ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమా చూశానని ఆయన వెల్లడించారు.
కానీ, బాలయ్య తన ముద్దుల మామయ్య అని, ఆయనను విశేషంగా అభిమానిస్తానని చెప్పారు. బాలా మామయ్య అన్ స్టాపబుల్ అని, ఆయన సినిమా రిలీజ్ నాడు ఫస్ట్ షో కు వెళ్తానని చెప్పారు. తాను ఎప్పుడూ కంటతడి పెట్టలేదని, దేవాన్ష్ పుట్టిన క్షణాల్లో చేతుల్లోకి తీసుకున్న సందర్భంగా ఆనందబాష్పాలు వచ్చాయని వెల్లడించారు.
అంతకుముందు, ఆటోడ్రైవర్లతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలని అన్నారు. యువతీయువకులు అడిగిన ప్రశ్నలన్నింటికీ లోకేష్ ఓపికగా సమాధానమిచ్చారు.