టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సీఐడీ అధికారులు సమర్పించారు. అంతేకాదు,15 రోజులపాటు చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని వారు కోరారు. ఇక, ఈ రిమాండ్ రిపోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల పేర్లను సీఐడీ అధికారులు పొందుపరచడం సంచలనం రేపుతోంది. కిలారు రాజేశ్ ద్వారా లోకేష్ కు కోట్ల రూపాయలు చేరాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు అచ్చెన్న ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబుపై, తనపై ఈ స్కామ్ లో ఆరోపణలు నిరూపిస్తే పీక కోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆరోపణలు నిజమని తేలితే తాను రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతానని అచ్చెన్న శపథం చేశారు. కక్ష సాధించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబును ఈ కేసులో ఇరికించి వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబేమన్నా ఉగ్రవాదా? ఆయన ఎక్కడకీ పారిపోలేదు…ఎందుకు అర్ధరాత్రి పూట అరెస్టు చేశారు అని అచ్చెన్న ప్రశ్నించారు.
రాజకీయ కక్ష సాధింపులు తప్ప రాష్ట్రంలో చట్టం,ధర్మం లేవని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని, చంద్రబాబు అరెస్టు చీకటి రోజని అన్నారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నారని, జగన్ చెప్పింది చేస్తున్న సీఐడీ అధికారులకు సిగ్గులేదని అన్నారు. కాగా, అచ్చెన్నాయుడుతోపాటు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ రద్దు చేశారు.