సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన కాసేపటికే ఓయూ జేఏసీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేయడం, ఆ తర్వాత వారికి జెట్ స్పీడ్ లో బెయిల్ రావడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓయూ జేఏసీ నేతలు పోలీసులను ఆశ్రయించిన వైనం చర్చనీయాంశమైంది.
అల్లు అర్జున్ కు తక్షణమే క్షమాపణ చెప్పాలని తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమకు బెదిరించారని, వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వచ్చాయని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.
అంతేకాకుండా, తమ ఫోన్ నెంబర్లను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని , తమను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఓయూ జేఏసీ నేతలు కోరారు.