న్యాయవాదులు.. కోర్టులు.. రాజకీయాలకు, నాయకులకు అతీతంగా ఉండాలి. బహిరంగంగా ఎవరికీ మద్ద తు ఇవ్వకూడదనేది కోర్టులు చెబుతున్న మాట. సరే.. ఇప్పుడు ఎవరూ ఏవీ పాటించడం లేదు కాబట్టి.. అందరూ ఒకే తాను ముక్కలు అయిపోయారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీలోని కొంద రు న్యాయవాదులు జై కొట్టారు ఆయనకు మద్దతుగా పాదయాత్రలు,ర్యాలీలు, ప్రచారం కూడా నిర్వహించా రు. కాకినాడ జిల్లా పిఠాపురం కోర్టు నుండి న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. పవన్ కల్యాణ్‌కు ఓటేసి గెలిపించాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని నినాదాలు చేశారు.
ఎందుకీ మద్దతు..
న్యాయవాదులు ఇప్పటి వరకు నేరుగా ఏ పార్టీకీ మద్దతు తెలపలేదు. పైగా.. ఎన్నికల్లో పాల్గొని ప్రచారం కూడా చేయలేదు. ఒకవేళ ఏ పార్టీపైనైనా.. ఏ నాయకుడిపైనైనా అభిమానం ఉంటే.. వారు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునేవారు. కానీ, ఇప్పుడు న్యాయవాదులు నేరుగా పవన్ బొమ్మలు పట్టుకుని, ఆ పార్టీ గుర్తులు పట్టుకుని రోడ్డెక్కడానికి కారణం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడమేనని వారు చెబుతున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకువచ్చింది. ఇది రాజకీయంగా ఎలాంటి మలుపు తీసుకున్నా.. అది వేరే సంగతి. నిత్యం చట్టాలు.. రాజ్యాంగం.. నిబంధనలతో సహజీవనం చేసే న్యాయవాదులు.. కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టంఅమల్లోకి వస్తే.. కోర్టుల ప్రమేయం లేకుండా పోతుందని.. ఇది కక్షిదారులకు ఇబ్బందులు తీసుకువస్తుందన్నది వీరి ఆందోళన. ఈ నేపథ్యంలో చట్టం రద్దు కోరుతూ.. గత ఆరుమాసాలుగా ఆందోళన చేస్తున్నారు.
తాజా ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని.. పవన్ ఇటీవల హామీ ఇచ్చారని.. లాయర్లు చెబుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు చెప్పారు కాబట్టి.. ఆయనకు మద్దతు ప్రకటించామని అంటున్నారు. అందుకే పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి పవన్ కు మద్దతుగా ఓటు వేయాలని ర్యాలీ నిర్వహిస్తున్నామని న్యాయవాదులు చెబుతున్నారు. మరి వీరిప్రచారం ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
అయితే.. ఇక్కడ మరో హెచ్చరిక ఉంది. న్యాయవాదులు ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని.. న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నప్పుడే ప్రమాణం చేస్తారు. ఇప్పుడుదీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. సదరు న్యాయవాదలపై సీరియస్ చర్యలు చేపడితే ఇబ్బందులు తప్పవు. మరి ఇది తెలియకుండానే వారు పవన్‌కు మద్దతు తెలిపారా? లేక.. ఏమైనా జరిగినా ఫర్వాలేదనుకున్నారో చూడాలి.