న్యాయవ్యవస్థను కించ పరుస్తు, జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ ఇద్దరు లాయర్లను అరెస్టు చేసింది.
తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిలో ఇద్దరు లాయర్లు మెట్ట చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధితో పాటు మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుంట రమేష్ కుమార్ ఉండటం ఆశ్చర్యంగా ఉంది.
ఇప్పటివరకు జడ్జీలను దూషించిన కేసులో చాలామందిని సీబీఐ అరెస్టు చేసింది.
అయితే ఇలా అరెస్టయిన వారిలో ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ తో పాటు మరో న్యాయవాది కూడా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.
మామూలు జనాలు అంటే న్యాయవ్యవస్ధ తో పాటు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు.
ఏదో కేసులో కడుపు మండి నోటికొచ్చినట్లు మాట్లాడారంటే ఏదోలే అనుకోవచ్చు.
కానీ సంవత్సరాల తరబడి లాయర్లుగా ప్రాక్టీసు చేస్తున్న ఇద్దరు కూడా అలాగే వ్యవహరించారంటే ఏమిటర్ధం ? అయితే వీళ్ళిద్దరు గతంలోనే తాము చేసిన పనికి క్షమాపణ చెబుతు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు.
ముగ్గురిని సీబీఐ హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు.
విచారణకు హాజరు కావాలంటు వీళ్ళ ముగ్గురికి సీబీఐ నోటీసు ఇచ్చింది. దాంతో హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసుకు వీళ్ళు శనివారం ఉదయం చేరుకున్నారు. దాదాపు 6 గంటల విచారణ తర్వాత వీళ్ళని అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది.
విచారణలో తమకు సహకరించటం లేదు కాబట్టి అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు ప్రకటించటం గమనార్హం. వెంటనే హైదరాబాద్ నుండి గుంటూరుకు తరలించారు.
వైద్య పరీక్షలు తదితరాల తర్వాత వీళ్ళ ముగ్గురిని అధికారులు రాత్రి 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయవ్యవస్ధతో పాటు జడ్జీలను దూషిస్తు వీళ్ళు చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు ? ఎవరు వీరితో వ్యాఖ్యలు చేయించారు ? జడ్జీలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంలో వీళ్ళను ప్రభావితం చేసిన వ్యక్తులెవరు అనే విషయాలు బయటకు రావాల్సుందని సీబీఐ అధికారులు కోర్టులో చెప్పారు. పైగా విచారణలో సహకరించని కారణంగా పోలీసు కస్టడీకి ఇవ్వాలంటు అధికారులు ప్రత్యేక కోర్టుకు చెప్పారు.