తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ల జాబితాలో కృతి శెట్టి ఒకరు. 2021లో విడుదలై సూపర్ హిట్ మూవీ ఉప్పెనతో కృతి శెట్టి కథానాయికగా కెరీర్ ప్రారంభించింది. బేబమ్మగా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను చేరువైంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలు హిట్ అవ్వడంతో.. టాలీవుడ్ లో కృతి శెట్టికి తిరుగే లేదని అందరూ భావించారు.
కానీ సీన్ రివర్స్ అయింది. బంగార్రాజు అనంతరం కృతి శెట్టి హిట్ ముఖమే చూడలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే.. ఇలా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. పైగా ఒకే తరహా పాత్రలను ఎంచుకోవడం కృతి శెట్టికి పెద్ద మైనస్ అయింది. ఎంత తొందరగా ఆమె స్టార్డమ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా ఫామ్ ను కోల్పోయింది. యంగ్ స్టార్స్ కూడా కృతి శెట్టికి ఛాన్సులు ఇవ్వడం లేదు.
ప్రస్తుతం కృతి శెట్టి ఆశలన్నీ `ఏఆర్ఎం(అజయంతే రాండమ్ మోషణం)`పైనే పెట్టుకుంది. మలయాళంలో కృతి డెబ్యూ మూవీ ఇది. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఓనం పండుగ సందర్భంగా సెప్టెంబర్ 12న ఏఆర్ఎం థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కృతి శెట్టికి ఒకరకంగా ఇదే ఆఖరి అవకాశం. కెరీర్ మళ్లీ ఊపందుకోవాలంటే ఈసారి కృతి శెట్టి హిట్ కొట్టి తీరాల్సిందే. లేదంటే ఆమెను దర్శకనిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేయడం ఖాయమవుతుంది.