తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్ అరెస్టు వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనను అరెస్టు చేస్తామంటూ.. పోలీసులు వ్యాఖ్యానించారు. అయితే.. న్యాయమూర్తి మాత్రం ఇప్పుడు వద్దులే.. కొంతదూకుడు తగ్గించండి.. అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఫార్ములా ఈ -రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగానే కోర్టును ఆశ్రయించిన కేటీఆర్.. బెయిల్ పొందారు.
ఈ నెల 30వ తేదీ వరకు కూడా కేటీఆర్‌కు ముందస్తు మధ్యంతర బెయిల్ ఉంది. అయితే.. దీనిని రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం ఈ పిటషన్ పై విచారణ సంద ర్భంగా కేటీఆర్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని.. కాబట్టి దీనిని కొట్టి వేయాలని కోరారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని వివరించారు.
ఈ సందర్భంగా ఏసీబీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. బలమైన ఆధారాలు ఉన్నాయని.. కేటీఆర్‌ను తక్షణమే అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. బెయిల్‌ను పొడిగించడం కానీ.. ఆయనపై నమోదైన కేసును కొట్టివేయడం కానీ చేయొద్దని కోరారు. ఈ కేసులో కేటీఆర్ ను విచారించాలని పేర్కొన్నా రు. ఈకీలక సమయంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఆయనకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని తెలిపారు.
ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఈ నెల 31కి విచారణను వాయిదా వేశారు. అప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. దీంతో కేటీఆర్‌కు కొంత వరకు ఊరట లభించినట్టు అయింది. బీఆర్ ఎస్ హయాంలో నిర్వమించిన ఫార్ములా ఈ – రేస్ కారణంగా.. ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్ సహా.. కొందరు అధికారులపైనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.