టీఆర్ఎస్ పార్టీ రథసారథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తుండగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీకి చెందిన కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషించే సంగతి తెలిసిందే. ముఖ్యమైన నిర్ణయాలు, ఎన్నికల విషయంలో ఆయన అభిప్రాయం అతి విలువైనదిగా పరిగణించబడుతుంది. అయితే, కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో కేటీఆర్ పాత్ర ఉండాల్సినంత యాక్టివ్‌గా లేదని పలువురు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ టీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాతో జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో అనేక ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. అయితే, ఈ బై పోల్ విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదన్న చర్చ జరుగుతోంది. తాజాగా కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మేరకు చర్చించుకుంటున్నారు.
హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరు ఖరారు చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరో టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు అసెంబ్లీకి రానున్నారని అభిప్రాయపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో తెలిసిన సంగతే. అలాంటి ఉప ఎన్నిక విషయంలో ప్రత్యక్షంగా రంగంలోకి దిగి టీఆర్ఎస్ సత్తాను చాటిచెప్పాల్సిన కేటీఆర్ కేవలం ట్వీట్లు, శుభాకాంక్షలకే పరిమితం అవుతున్నారని అంటున్నారు.