తెలంగాణలో వనదేవతలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క-సారలమ్మలపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ‘వాళ్లేమన్నా బ్రహ్మలోకం నుంచి దిగొచ్చారా? ఎవరు వాళ్లు.. అడవి దేవతలు.. పూజలు చేస్తే చేసుకోండి.. తర్వాత అక్కడ బ్యాంకులు ఏర్పడ్డాయి.. పెద్ద బిజినెస్ గా మారిపోయింది’ అంటూ చినజీయర్ స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
వీడియో కొత్తదైనా…పాతదైనా చినజీయర్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని ఆదివాసీ భక్తులు, సీపీఐ, బీఎస్పీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చినజీయర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. చినజీయర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు చోట్ల చినజీయర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
తాజాగా ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
చినజీయర్ స్వామిలా మోసాలకు పాల్పడడం తమ జాతికి తెలియదని అన్నారు. ఆదివాసీల గూడేలలో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.
అయితే, ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్న టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు గుప్పించడం వెనుక మంత్రి కేటీఆర్ స్కెచ్ ఉందన్న టాక్ వస్తోంది. కొంతకాలంగా కేసీఆర్, చిన జీయర్ స్వామిల మధ్యలో విభేదాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో…ఈ వీడియోను కేటీఆర్ వెలుగులోకి తెచ్చారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి, ఈ వ్యవహారంపై చిన జీయర్ స్వామి ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.