వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ చేసిన విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. పవన్… నీ చెప్పును జాగ్రత్తగా ఉంచుకో. వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజున అదే చెప్పుతో నిన్ను నీవు కొట్టుకో అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు ఆత్మాభిమానం కంటే ప్యాకేజీయే ముఖ్యమని, చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పవన్ జనసేన ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు.
సిగ్గు లేకుండా కన్నతల్లిని తిట్టిన వారితోనే పవన్ కలిసి నడుస్తున్నాడని నాని మండిపడ్డారు. ముందు బ్రహ్మానందం డైలాగులు వదిలి పవన్ సక్రమమైన మార్గంలో వెళ్లాలని నాని ఎద్దేవా చేశారు. చురకలంటించారు. పవన్ కు కాపు సామాజిక వర్గం, ప్రజలు ముఖ్యం కాదని, జగన్‌ను గద్దె దించడమే ఆయన లక్ష్యమని మండిపడ్డారు. 100 మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరని చెప్పారు.
ఉత్తరాంధ్రలో విశాఖ గర్జన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే పవన్‌ను చంద్రబాబు విశాఖకు పంపారని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులపై దాడి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ రాజకీయ కాల్షీట్లు ఇస్తున్నాడని, చంద్రబాబుని సీఎం చేయడం పవన్ లక్ష్యమని కొడాలి నాని అన్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత పవన్ మంచి నటుడని, ఆ నటనంతా మొన్న మంగళగిరిలో కనిపించిందని ఎద్దేవా చేశారు.
మంగళగిరిలో పవన్ స్పీచ్..ఆ తర్వాత పవన్ ను చంద్రబాబు కలవడం…ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని ఆరోపించారు. పార్టీ పెట్టి ఒక్క చోట కూడా పోటీ చేయకుండా వేరే పార్టీకి మద్దతిచ్చిన ఘనత పవన్ దేనని ఎద్దేవా చేశారు.