ప్రముఖ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి పరిచయాలు అక్కర్లేదు. కన్నడ నటుడే అయినా.. తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులకు కూడా సుదీప్ సుపరిచితుడే. వెండితెరపై విలక్షణ నటుడిగా.. బుల్లితెరపై హోస్ట్ గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న కిచ్చా సుదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
`ఒకానొక దశలో రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. ప్రతి హీరో చివర్లో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తాడు. అందువల్ల జీవితాంతం హీరోగా చేయలేం. అలా అని నాకు సహాయక పాత్రలు చేయాలని లేదు. ఇప్పటికే చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నాను.. స్క్రీప్ నచ్చక కాదు.. ఈ వయసులో అటువంటి చిత్రాలు చేయడం ఇష్టంలేక. ఇక హీరోగా, విలన్ గా చేసింది చాలా అనిపించినప్పుడు నటుడిగా రిటైర్మెంట్ తీసుకుంటా. దర్శకుడిగానో, నిర్మాతగానో సెటిలైపోతా` అంటూ కిచ్చా సుదీప్ వ్యాఖ్యానించారు.
అయితే ఓవైపు సుదీప్ తన రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే.. మరోవైపు ఆయన కూతురు సాన్వీ సుదీప్ నటిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే గుర్తింపు పొందిన సాన్వి.. త్వరలో ప్రధాన నటిగా అరంగేట్రం చేయబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఆమె కన్ఫార్మ్ చేసింది. హైదరాబాద్ లో నాలుగు నెలల వర్క్‌షాప్‌లో పాల్గొని శిక్షణ పూర్తి చేసిన సాన్వి.. తండ్రి పేరుతో సంబంధం లేకుండా సొంతంగా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాల్లోనూ ప్రయత్నించాలని ఉంది.. కానీ నటిగా గుర్తింపు పొందడమే తన అసలైన టార్గెట్ అని సాన్వి పేర్కొంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటిగా ఎలాంటి పాత్రలైనా చేస్తానని స్పష్టం చేసింది. కాగా, గతంలో సాన్వి ఒక మ్యూజిక్ ఆల్బమ్‌పై పనిచేసింది. అలాగే జిమ్మీ చిత్రంలో ఒక పాటకు తన గాత్రాన్ని అందించింది.