కియారా అద్వానీ.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. `ఫగ్లీ` అనే హిందీ మూవీ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ పాపకి టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. `భరత్ అనే నేను` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా `వినయ విధేయ రామ`లో నటించింది.
కానీ, ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఇకపోతే కియారా తాజాగా `భూల్ భులయ్యా 2` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. 2007లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘భూల్ భులయ్యా’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, కియరా అద్వానీ జంటగా నటించగా.. సీనియర్ నటి టబు కీలక పాత్రను పోషించింది.
ఈ హార్రర్ కామెడీ చిత్రం మే 20న విడుదలై.. ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. తొలి రోజు తొలి షో నుంచే బాలీవుడ్లో హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కియారా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం ఆమె షేర్ చేసుకుంది.
అయితే ఈ ఇంటర్వ్యూలో దెయ్యాలంటే భయమా అని ప్రశ్నించగా.. అందుకు కియారా `నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. అవి చూస్తే రాత్రుళ్లు నిద్ర పట్టదు. ఒంటరిగా పడుకోవాలన్నా భయం వేస్తుంది. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను.` అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తాను చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని సైతం ఆమె అందరితోనూ పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. `కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా పడటం వల్ల 4 రోజులపాటు అందరం హోటల్ రూమ్ లోనే ఉండాల్సి వచ్చింది. కరెంట్ లేదు. తాగేందుకు సరిగ్గా వాటర్ కూడా దొరకలేదు. చలిని తట్టుకునేందుకు గదిలో మంట వేసుకున్నాం. అయితే నాలుగో రోజు రాత్రి నిద్రపోతున్న టైమ్‌లో అనుకోకుండా మంటలు కుర్చీకి అంటుకుని రూమ్ మొత్తం వ్యాపించాయి.
అది చూసిన నా ఫ్రెండ్ అందర్నీ నిద్రలేపింది. దాంతో మేమంతా కేకలు పెట్టడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి డోర్స్ పగలగొట్టారు. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం. ఆ రోజు చావుని దగ్గర నుంచి చూశా` అంటూ కియారా పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.