ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొలువుదీరి ఎనిమిది నెలలు గడుస్తోంది. వైకాపా ప్రభుత్వంలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. మరోవైపు విపక్ష వైసీపీ మాత్రం అవకాశాలు దొరక్కపోయినా కల్పించుకుని మరీ కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని విభేదాలు సృష్టించే పనిలో పడింది. తాజాగా గుడ్ మార్నింగ్ స్టార్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఓ ప్రముఖ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేతిరెడ్డి.. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్సే లేదంటూ తేల్చేశారు. కేతిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి మాదిరిగానే పవన్ కళ్యాణ్ ది కూడా ఒక సక్సెస్ స్టోరీనే. 2019 ఎన్నికల్లో జనసేన నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయింది. పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే, ఆ ఎమ్మెల్యే కూడా వెళ్లిపోయాడు. అయినా కూడా పవన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మొన్నటి ఎన్నికల్లో 21 సీట్లు తీసుకుని అన్ని చోట్ల గెలిచాడంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.
పవన్ మాదిరి ఎవరూ మాట్లాడలేరు.. కులాల పరంగా, మతాల పరంగా చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. అదే అతనికి బలమైందని కేతిరెడ్డి కొనియాడారు. పవన్ అనేవాడు లేకుంటే 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్ను ఓడించలేదని కేతిరెడ్డి అన్నారు. ఒకవిధంగా పవన్ని ఆశాకానికి ఎత్తేసిన కేతిరెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా మరో పదేళ్లపాటు సీఎంగా చంద్రబాబు ఉండాలని పవన్ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేశారు. ఈ లెక్కన ఇప్పట్లో పవన్ను ముఖ్యమంత్రిగా చూసే అవకాశం అభిమానులకు, అతని కమ్యూనిటీ ప్రజలకు రాదని కేతిరెడ్డి పేర్కొన్నారు.
భవిష్యత్తు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య రిలేషన్ ఇంతే సవ్యంగా సాగుతుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో డైనమిక్స్ మారుతూ ఉంటాయి. సొంత కుటుంబ సభ్యుల మధ్యే గొడవలు వస్తున్నాయి. ఇక ఈ బాంధవ్యాలు, బంధుత్వాలు ఎంత అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కేంద్రంలో బీజేపీ ఉంటే ఏమైనా జరగొచ్చని.. ఒక మూడు వ్యవస్థలతో పొలిటికల్ గేమ్స్ ఆడడమే బీజేపీ సక్సెస్ ఫార్ములా అని కేతిరెడ్డి అన్నారు.