టీడీపీ మాజీ నేత, కేశినేని నానిపై ఆయన సోదరుడు, విజయవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక కేశినేని నాని కోవర్టులా పని చేశారని, అన్ని విషయాలు జగన్ కు చేరవేశారని ఆయన ఆరోపించారు. లోకేష్ ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ లాయర్లతో ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాలను జగన్ కు నాని చేరవేశారని ఆరోపించారు.
ఇక, ఎన్టీఆర్ జిల్లాలో టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర నాని కోట్ల రూపాయలు వసూలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. మైలవరం టికెట్ ఇస్తానని ఇంకో ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని, ఆఖరికి ప్రాణ స్నేహితుడి దగ్గర కూడా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. విజయవాడ ఎంపీగా టిడిపిలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఇప్పుడు వైసీపీలో చేరి జగన్ పాలేరుగా మారారని ఎద్దేవా చేశారు. పిట్టలదొర అని తనను విమర్శించిన నాని పరిస్థితి ఏంటో ఎన్నికల తర్వాత తేలిపోతుందని విమర్శించారు. విజయవాడ సీటు కూడా ఆయనకు వైసిపి ఇచ్చే అవకాశం లేదని, ఎన్నికలు అయిన తర్వాత ప్రజా జీవితంలో నాని అనే వ్యక్తి ఉండడని చెప్పారు.