ఎన్నికలకు భయపడే కేసీయార్ యూటర్న్ తీసుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈనెల 27వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే విషయమై సీనియర్లతో మాట్లాడిన కేసీయార్ సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీజీబీకేఎస్ దూరంగా ఉండాలని డిసైడ్ చేశారు. తండ్రి ఆదేశాలను సంఘం నేతలకు కవిత చెప్పారు. దాంతో గుర్తింపు సంఘం ఎన్నికలకు టీజీబీకేఎస్ దూరమనే ప్రచారం పెరిగిపోయింది. అయితే తెరవెనుక ఏమి జరిగిందో ఏమో తెలీదుకానీ సడెన్ గా ఎన్నికల్లో పాల్గొనాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు.
దాంతో తొందరలో జరగబోయే ఎన్నికల్లో పోటీకి టీజీబీకేఎస్ తరపున అభ్యర్ధులు రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో పోటీచేసే విషయమై 24 గంటల్లోనే కేసీయార్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అర్ధంకావటంలేదు. అయితే పార్టీవర్గాల సమాచారం ప్రకారం యూనియన్ ఎన్నికలకు అనుబంధ సంఘం దూరంగా ఉంటే జనాల్లో రాంగ్ సిగ్నల్ వెళుతుందని యూనియన్ నేతలు కేసీయార్ పై బాగా ఒత్తిడి తెచ్చారట. గెలుపోటములతో సంబంధంలేకుండా పోటీలో ఉండాల్సిందే అని యూనియన్ నేతలు గట్టిగా చెప్పారట.
దాంతో చేసేదిలేక కేసీయార్ కూడా ఎన్నికల్లో పాల్గొనేందుకు అంగీకరించారని పార్టీవర్గాల సమాచారం. ఇక్కడ విషయం ఏమిటంటే మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమిలో భాగంగానే సింగరేణి కోల్ ఏరియా పరిధిలోకి వచ్చే నాలుగు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపు స్వీప్ చేసింది. పై నాలుగు జిల్లాల్లోని సింగరేణి ఏరియాలోకి వచ్చే 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పదిచోట్ల గెలిచింది. ఒక స్ధానాన్ని బీఆర్ఎస్ గెలుచుకోగా మరో స్ధానాన్ని కాంగ్రెస్ తో పొత్తులో సీపీఐ గెలుచుకుంది.
కోల్ బెల్ట్ ఏరియాలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల ఓట్ల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది. రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే సీన్ రిపీటవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకనే గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోవటం ఎందుకన్నది కేసీయార్ ఆలోచన.