అటు కాంగ్రెస్ కు.. ఇటు బీజేపీకి సమాన దూరం పాటిస్తున్నామని మూడో ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో థర్ఢ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొద్ది కాలంగా ఆయన ఈ విషయంపై సైలెంట్ అయిపోయారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ చూస్తున్నారు. కానీ మూడో ఫ్రంట్ గురించి మాత్రం ఇటీవల మాట్లాడటం లేదు. అటు బీజేపీకి చెందిన ఎన్టీయే కూటమిలో కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా పెట్టిన ప్రతిపక్షాల కూటమి ఇండియాలో కానీ కేసీఆర్ చేరలేదు.
కానీ ఇప్పుడు మరోసారి మూడో ఫ్రంట్ కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కేసీఆర్ తో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొనడమే అందుకు కారణమని చెప్పాలి. గతంలో కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరంలో ఉంటున్నామని మూడో ఫ్రంట్ కోసం కేసీఆర్ ఇతర జాతీయ స్థాయి నాయకులతో చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రగతి భవన్ కు ఇతర జాతీయ నాయకులను రప్పించుకున్నారు. కానీ ఖర్చు తప్ప కేసీఆర్ కు మూడో ఫ్రంట్ దిశగా ఏదీ కలిసి రాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆ తర్వాత బీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో విస్త్రతం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహారాష్ట్రపై ఆయన ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి మరోసారి మూడో ఫ్రంట్ ఆలోచన చేయడం బీజేపీ కోసమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని జాతీయ పార్టీలు ఏదో ఓ కూటమిలో చేరిపోయాయి. కేసీఆర్ మూడో కూటమిలో చేరేందుకు మాయవతి లాంటి వాళ్లు తప్ప ఇంకెవరూ లేరు. ఈ నేపథ్యంలో బీజేపీకి మేలు చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ఆలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఫ్రంట్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చడమే కేసీఆర్ ఉద్దేశమని, తద్వారా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం బీజేపీతో కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ మూడో ఫ్రంట్ కూడా అందుకోసమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.