శ్రీశైల పుణ్యక్షేత్రంలో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైల పురవీధుల్లో కన్నడ యువకులు బీభత్సం సృష్టించారు. ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం దగ్గర కర్ణాటక, స్థానిక భక్తుల మధ్య జరిగిన గొడవ చినికిచినికి గాలివానలా మారింది. టీ కొనుగోలు చేసిన కన్నడ భక్తుడు మంచినీళ్లు కావాలని షాపు యజమానిని అడగగా…అతడు లేవని సమాధానమిచ్చాడు. టీ కొంటే మంచినీరు కూడా ఇవ్వరా అంటూ మొదలైన గొడవ హింసాత్మకంగా మారింది.
ఈ గలాటాలో కర్ణాటక భక్తుడిపై స్థానికులు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. అతడు తీవ్రంగా గాయపడడంతో వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.తమ మిత్రుడికి గాయం కావడంతో కన్నడ భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. వీధుల్లోకి గుంపులుగా వచ్చి అక్కడి తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై కన్నడ భక్తులు దాడికి దిగారు. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లతో పాటు, తాత్కాలిక షాపులను ధ్వంసం చేశారు.
టీ స్టాల్ కు నిప్పు పెట్టారు. కన్నడ భక్తుల తీరుపై మండిపడ్డ స్థానికులు ప్రతిదాడికి దిగారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారాన్ని తెలుసుకున్న డీఎస్పీ శ్రుతి హుటాహుటిని శ్రీశైలం చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు. జగద్గురు పీఠం వారి సహాయంతో కర్ణాటక భక్తులను శాంతిపజేశారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్షేత్ర పరిసర ప్రాంతాలలో విద్యుత్ నిలిపేసిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతానికి శ్రీశైలం క్షేత్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు చెప్పారు. ప్రతి ఉగాదికి కర్ణాటక నుంచి వందలాది మంది భక్తులు కాలి నడకన శ్రీశైలానికి వస్తుంటారు. ఉడిపి తదితర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ శ్రీశైలం వచ్చే కన్నడ భక్తులు రెండు మూడు రోజులపాటు ఇక్కడే మకాంవేసి, పండుగ తర్వాత వెనుదిరుగుతారు.