యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో కల్కి 2989 ఏడీ ఒకటి. అయితే భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీ దత్ నిర్మాణంలో అసలు సిసలైన పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న కల్కిలో ప్రభాస్ హీరోగా నటిస్తే.. దీపికా పదుకొనే, అబితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. పలువురు స్టార్ హీరో,హీరోయిన్లు మరియు దర్శకులు ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో మెరిశారు. మైథాలజీని మరియు సైన్స్ ఫిక్షన్ ను జోడించి, ఫాంటసీ మిక్స్ చేసి, స్టార్ బలాన్ని వాడుకుని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ: కురుక్షేత్ర యుద్ధభూమిలో `అశ్వత్థామ హతః కుంజరః` అనే డైలాగ్‌తో కల్కి 2898 ఏడీ సినిమా మొదలైంది. యుద్ధంలో జరిగిన మోసాన్ని తట్టుకోలేక అశ్వద్ధామ(అమితాబ్ బచ్చన్) పాండవులకు వారసుడే ఉండకూడదన్న ఉద్దేశంతో అర్జునుడి కొడుకు అభిమన్యు భార్య అయిన ఉత్తర గర్భం వైపు బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు. దాంతో మహిళలపై నీ ప్రతాపమా అంటూ శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు ఓ కఠినమైన శాపాన్ని ఇస్తాడు. ఆ శాప విమోచనం గురించి చెబుతాడు. ఆ తర్వాత కురుక్షేత్రం యుద్ధం జరిగిన ఆరు వేల ఏళ్లకు కథ చేరుకుంటుంది. 2898 ఏడీ లో ప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీ పట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది.
భూమి నుంచి వనరులు అన్నీ లాగేసుకొని కాంప్లెక్స్ అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్). భూమిపై సరైన సౌకర్యాలు లేక ఇబ్బింది పడుతున్న భైరవ (ప్రభాస్) ఎలాగైనా కాంప్లెక్స్ లోకి వెళ్లి బతకాలని బలమైన కోరికతో ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ 6000 వేల సంవత్సరాల తర్వాత సుమతి (దీపికా పదుకొనే) గర్భం నుంచి కల్కి(దేవుడు) రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ కు తెలుస్తుంది. మరోవైపు భగవంతుడ్ని కడుపును మోస్తున్న తల్లిని కాపాడేందుకు అశ్వత్థామ వస్తాడు. అయితే అతినికి భైరవ అడ్డుపడతాడు. అసలు భైరవ ఎవరు..? అశ్వత్థామ తో ఎందుకు యుద్ధానికి దిగాడు..? సుప్రీమ్ యాస్కిన్ మోటివ్ ఏంటి..? అశ్వద్థామ శాప విమోచనం జరిగిందా? అసలు ప్రాజెక్ట్ కె అంటే ఏమిటి..? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ: మహాభారతం యుద్దం నేపథ్యంగా కథ మొదలై.. భవిషత్యత్తుకు ముడిపెడుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. కాంప్లెక్స్, కాశీ, శంభల అనే మూడు ప్రపంచాలను సృష్టించి ప్రేక్షకుడికి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించాడు. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాల కష్టాలనే చూపించారు. సినిమా స్టార్ట్ అయిన అరగంటకు ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆలస్యమైనా కూడా ప్రభాస్ ను పరిచయం చేసిన విధానం విజిల్స్ కొట్టించే విధంగా ఉంటుంది. అక్కడక్కడ సర్ప్రైజింగ్ కామియో రోల్స్ ఆకట్టుకుంటాయి.
ఇంటర్వెల్ బ్లాక్ లో ఒక్కసారిగా విస్ఫోటనం సృష్టించిన నాగ్ అశ్విన్.. సెకండ్ హాఫ్ లో డ్రామా నడిపిస్తూనే యాక్షన్ సన్నివేశాలను కళ్ళు చెదిరేలా డిజైన్ చేశారు. మధ్యమధ్యలో సినిమా స్లో ఫేజ్‌లోకి వెళ్లడం, కాంప్లెక్స్ చుట్టూ సాగిన సన్నివేశాల్లో గందరగోళం, కొన్ని విషయాలు సామన్య ప్రేక్షకులకు అర్థం కాకపోవడం ఇవన్నీ కాస్త కలవరపెట్టినా కూడా విజువల్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. యాక్షన్ ఎపిసోడ్స్ ఆ మైనస్ లని కవర్ చేశాయి. ముఖ్యంగా విజువల్స్‌కి కచ్చితంగా సలాం కొట్టాల్సిందే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజువల్స్ ఇంటర్నేషనల్ లెవల్ లో ఉంటాయి. క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
యాక్టింగ్ విషయానికి వస్తే.. సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. లుక్స్ అండ్ యాక్షన్ తో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. అలాగే అశ్వాద్ధామగా యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో అమితాబ్ అదరగొట్టేశారు. ప్రతినాయకుడిగా కమల్ హాసన్, సుమతి పాత్రలో దీపిక నటన అద్భుతమనే చెప్పాలి. మిగిలన వారు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాటోగ్రఫి, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగాల పనితీరు ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే థియేటర్స్ లో కచ్చితంగా చూడాల్సిన సినిమా కల్కి 2898 ఏడీ.