సుమ కనకాల.. సినీ ప్రియులకు ఈమె గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరళలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సత్తా చాటుతోంది. ఎంతో మంది కొత్త యాంకర్లు వచ్చి గ్లామర్ షో చేస్తున్నా.. సుమ స్థానాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. టీవీ షోలే కాదు ఏ సినిమా పంక్షన్ జరిగినా యాంకర్‌గా సుమనే కావాలంటారు నిర్మాతలు. అంతలా ఆమె పాపులర్ అయింది.
అలాంటి సుమ పరువును దారుణంగా తీసేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి ఇందులో కీలక పాత్రలను పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ దేశ వ్యప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న సంగీత దర్శకుడు కీరవాణి.. ఎన్టీఆర్, చరణ్‌లతో లైవ్ చిట్ చాట్ చేశారు. అయితే ఈ సందర్భంగా కీరవాణి సుమ ప్రస్తావన తీసుకువచ్చారు.
`సుమ త్వరలోనే జయమ్మ పంచాయితీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకవేళ ఆమెకి మీ సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇస్తారు..?` అని కీరవాణి హీరోలిద్దరినీ ప్రశ్నించాడు. అందుకు ఎన్టీఆర్ వెంటనే స్పందిస్తూ.. `నాయనమ్మ, అమ్మమ్మ లాంటి ముసలమ్మ పాత్రలు ఆమెకు ఇవ్వాలి. అలాగే ఆమెను చూస్తే గయ్యాళి అత్త పాత్రలు గుర్తొస్తాయి, ఆయా పాత్రలు ఆమెకు బాగా సెట్ అవుతాయి` అని చెప్పుకొచ్చాడు.
అంతటితో ఆగని ఎన్టీఆర్.. సుమ భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఆమెకి చాదస్తం ఎక్కువ, ఎప్పుడూ నోరేసుకుని పడిపోతుంటుంది అని ఫన్నీగా చెబుతూనే ఆమె పరువును తీసేశాడు. మరోవైపు రామ్ చరణ్ పంజాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్ర సుమకు సూట్ అవుతుందని తెలివిగా సమాధానమిచ్చాడు. మొత్తానికి వీరి సరదా సంభాషన మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.