తమకు ప్రజల అండదండలున్నాయని, అందుకే గత ఎన్నికల్లో 151 సీట్లు కట్టబెట్టారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని, అందుకే ఈ సారి ప్రజలు తమకు 175 సీట్లతో సత్కరిస్తారని కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు. వారు చెబుతున్నది కాసేపు నిజమే అనుకుందాం. వైసీపీపై ఇంత ఆదరణ ఉంటే వైసీపీ నేతల సభలకు ప్రజలు బారులు తీరాలి…సభలో చెప్పేదంతా వినాలి.
కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. మంత్రులు మాట్లాడుతుండగానే సభల నుంచి జనం వెళ్లిపోతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విజయవాడలో జరిగిన వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతుండగానే కొందరు మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, అలా వెళ్లిపోతున్న మహిళలను జోగి రమేష్ బెదిరించారు. ఆ వెళ్తున్న వారి పేర్లు రాసుకోవాలని, వారు ఏ వార్డువారో కనుక్కోవాలని అధికారులను సభా వేదికపై నుంచే మైక్ లో నుంచే బిగ్గరగా హుకుం జారీ చేశారు.
ఏ అక్కా…వెళ్లిపోతావేంటి…మీకోసమే కదా చెబుతున్నది…ఏం పది నిమిషాలు కూడా కూర్చోలేవా? అంటూ ఆ మహిళలను జోగి బెదిరించారు. ఇక, చేసేదేమీ లేక ఆ మహిళలు వెనక్కు వచ్చి బలవంతంగా మంత్రిగారి మాయ మాటలు విన్నారు. పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు. ఇలా బెదిరించి బలవంతంగా కూర్చోబెట్టడం ఏమిటంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఈ వ్యవహారంపై టీడీపీ అగ్రనేత నారా లోకేష్ స్పందించారు. తిరిగి వచ్చి కూర్చొని మీటింగ్ లో చెప్పేది వినకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ బెదిరించడం దారుణమని మండిపడ్డారు. అసలే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆందోళన చెందుతున్న సమయంలో మహిళలని ఏకంగా మంత్రులే బెదిరించడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదనే విషయం మరోసారి స్పష్టమైందని అన్నారు.