రాజకీయాల్లో రాణించాలన్నా.. ప్రజల ఆదరణ పొందాలన్నా.. నాయకులు గత పొరపాట్లను చక్కదిద్దుకుని ముందుకు సాగాలి. కానీ చేసిన తప్పులే మళ్లీ చేస్తుంటే ప్రజల్లో నాయకుడనే భావం పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రజల్లోకి వచ్చి అండగా నిలవాల్సిన సమయంలోనూ ఆయన కేవలం ఇంటికే పరిమితం కావడం ఇప్పుడు విమర్శలకు కారణమైంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటే చాలు అనేది ఆయన సినిమాల్లోని డైలాగే. కానీ రాజకీయాల్లో మాత్రం అది పనికి రాదన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది.
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చామని.. ప్రజలకు అండగా ఉంటామని జనసేన ఎప్పుడూ చెబుతుంటుంది. కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికే అది కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఎప్పుడో ఓ సారి ప్రజల్లోకి వచ్చి ఓ రెండు సభల్లో మాటలతో ఊగిపోయి ఆ తర్వాత పవన్ కనిపించరని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి.
ప్రజల్లో ఉంటూ ఆ అభిప్రాయాలను చెరిపేయాల్సిన పవన్.. మళ్లీ మళ్లీ అలాగే వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు తాజాగా వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన రాకుండా నాదెండ్ల మనోహర్‌ను పంపడమే కారణమని తెలుస్తోంది.
ఏపీలో అధిక వర్షాలు వరదల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ఆ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తాను రాకుండా.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పంపించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాదెండ్ల మాటలు సూటిగా ప్రభుత్వానికి తగలడం లేదని.. ప్రజల్లోకి వెళ్లడం కూడా లేదని టాక్. మరోవైపు బీజేపీ నుంచి కూడా కీలక నేతలు, సీపీఐ నారాయణ కూడా రోడ్డెక్కారు. కానీ పవన్ మాత్రం బయటకు రాలేదు.
ఇప్పుడు పవన్ షూటింగ్‌లకు కూడా గ్యాప్ ఇచ్చి ఖాళీగానే ఉన్నట్లు సమాచారం. మరి ఈ సమయంలో వచ్చి వరద బాధితుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుండేదన్న వాదన సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. స్వయంగా తాను చేయాల్సిన పనులను కూడా ఇలా పార్టీ నేతలకు అప్పగిస్తున్నారని అంటున్నారు.
మరోవైపు ఈ జిల్లాల పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ నష్టం అంచనా వేస్తారని.. ఆ తర్వాత పవన్ వచ్చి పర్యటిస్తారని పార్టీ చెబుతోంది. అప్పటివరకూ ఈ వేడి ఉంటుందా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. రాజకీయాల్లో నాయకులకు సరైన టైమింగ్ అవసరం. ఛాన్స్ దొరికితే చాలు అల్లుకుపోవాలి. కానీ ఇంత మంచి అవకాశాన్ని పవన్ ఎందుకు వృథా చేసుకుంటున్నారన్నది మాత్రం తెలియడం లేదని నిపుణులు అంటున్నారు.