రాజమండ్రి: జనసేన నిర్వహిస్తున్న శ్రమదాన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కార్యక్రమంపై హై టెన్షన్ కొనసాగుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని జనసేన నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. రాజమండ్రి వైపు వాహనాలు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్‌కల్యాణ్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
గాంధీ జయంతి సందర్భంగా కాటన్ బ్యారేజీ రోడ్డు మరమ్మతులు చేయాలని పవన్ నిర్ణయించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇరిగేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు.
అధికారుల సూచనతో హుకుంపేట-బాలాజీపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చుకున్నారు. అక్కడ కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు.
శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. గత రాత్రి నుంచే పలువురు జనసేన నేతలను గృహనిర్బంధం చేశారు.
రాజమండ్రిలో పవన్ పర్యటనకు వెళ్లకుండా పోలీసుల ముందస్తుగా చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా జనసేన నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని కాటన్ బ్యారేజీ వద్ద మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్త త్తచెరువు-పుట్టపర్తి రహదారిలో గుంతలకు మరమ్మతులు చేపట్టేలా జనసేన ఏర్పాట్లు చేసుకుంది. ఈ రెండు కార్యక్రమాల్లో పవన్‌కల్యాణ్ పాల్గొనేలా ప్లాన్ వేసుకున్నారు. అయితే పవన్ పర్యటనకు పోలీసుల అడ్డంకులు సృష్టిస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లాలో కూడా పవనకల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని చెబుతున్నారు. జనసేనాని ధవళేశ్వరం బ్యారేజీ పర్యటన ముగించుకుని, మధ్యాహ్నం 2 గంటలకు కొత్తచెరువుకు షెడ్యూల్ మేరకు చేరుకోవాల్సి ఉంది.
జిల్లాలో పవనకల్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. జిల్లాలో జనసేన నేతలు, పవన పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసుల ఆంక్షల వల్ల రెండు జిల్లాలో పవన్ పర్యటనపై గందరగోళం ఏర్పడింది. శ్రమదానం కార్యక్రమంలో ఉత్కంఠ నెలకొంది.