పని వేళల్లో తాపీగా పబ్జీ గేమ్ ఆడుతున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి జనసేన ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేటీఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే హోదాలో కాకుండా ఒక సామాన్య వ్యక్తిలా ముఖానికి మాస్క్ పెట్టుకుని ఆఫీసులో తనిఖీ చేశారు.
అయితే సరిగ్గా అదే సమయంలో సాయి కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి.. పని చేయడం మానేసి తాపీగా ఫోన్లో పబ్జి గేమ్ ఆడుకుంటూ ఎమ్మెల్యే బాలరాజు కంటపడ్డారు. చాలా సేపు వెనకే ఉండి బాలరాజు అతన్ని గమనించారు. సదరు ఉద్యోగి మాత్రం ఎవర్నీ పట్టించుకోకుండా గేమ్ లో మునిగిపోయారు. దాంతో సాయి కుమార్ పై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు.
పని సమయాల్లో ఇంతటి నిర్లక్షమా అంటూ విరుచుకుపడ్డారు. అతడిని సస్పెండ్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఊహించని పరిణామంతో సదరు ప్రభుత్వ ఉద్యోగికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్యే అనుచురుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎమ్మెల్యే బాలరాజు చేసిన పని పట్ల పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.