“రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఎవరైనా చేస్తారు. కానీ, నిలబడి.. నిరూపించుకునేవారే నాయకులుగా గుర్తింపు తెచ్చుకుంటారు“- ఇండియన్ పాలిటిక్స్‌ను ఉద్దేశించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.. కులదీప్ నయ్యర్.. గతంలో ఎన్సీపీ(శరద్ పవార్)ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య.. ప్రస్తుత జనసేన పార్టీకి అచ్చుగుద్దిన ట్టు సరిపోతుంది. ఎందుకంటే.. పార్టీ ఆవిర్భావం జరిగిపోయింది. కానీ, పార్టీలో నాయకులే కనిపించడం లేదు. ఇంకొంచెం కటువుగా చెప్పాలంటే.. పార్టీ అధినేతలోనే స్థిరత్వం కనిపించడం లేదు!! ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవర్ స్టార్.. ప్రశ్నలు కొనితెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారనేది నిష్టుర సత్యం.
ఏ విషయాన్ని తీసుకున్నా.. ఆయన వేసిన అడుగులు పార్టీకి, పార్టీలో నేతలకు భవితను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒక తప్పు చేయొచ్చు.. కానీ, దాని నుంచి నేర్చుకునే పాఠాల ద్వారా.. తప్పులు చేయకుం డా.. ముందుకు సాగాల్సి ఉంది. కానీ, తప్పులపై తప్పులు చేస్తూ.. వాటినే ఒప్పులుగా భ్రమించే పరిస్థితి పవన్ విషయంలోనే కనిపిస్తోంది. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా.. అంతిమ లక్ష్యం అధికారమే!
సేవలు చేయాలంటే..స్వచ్ఛంద సంస్థలు ఈ దేశంలోను, రాష్ట్రంలోనూ కోకొల్లలు. ఈ చిన్న సూత్రం విస్మ రించారో.. లేక పార్టీ స్థాపన సమయంలోనే వద్దనుకన్నారో తెలియదు కానీ.. ప్రశ్నిస్తానంటూ..పార్టీ పెట్టి.. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు పవన్. ఆ సమయంలోనే పార్టీని బలోపేతం చేసుకుంటే.. బాగుంటుం దన్న రాజకీయ విశ్లేషకుల మాటను ఆయన పెడచెవిన పెట్టారు. అంతేకాదు.. తర్వాత కూడా నిలకడలేని మాటలు.. కుదరులేని అడుగులతో తనను తానే మేధావి వర్గంలో డైల్యూట్ చేసుకున్నారు.
అదేసమయంలో యువత తనకు అండగా ఉంటుందని పవన్ అనుకున్నా.. ఎన్నికల సమయానికి ఆ యువతను కూడా పక్కన పెట్టారు. గుర్తుందో లేదో కానీ.. 2019 ఎన్నికలకు ముందు తన పార్టీలో టికెట్లు కావాలంటే.. పరీక్షలు రాయాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు పరీక్షలు పెట్టారు. తర్వాత.. ఆ రిజల్ట్ ఏమైందో.. ఎంత మందికి ఆయన టికెట్లు ఇచ్చారో కూడా తెలియలేదు. ఇక, పొత్తులు అవసరమే అయినా.. దీనికి ప్రాతిపదిక ఏంటి? అనే విషయంలోనూ పవన్ వెనుకబడిపోయారు.
వైసీపీని ఓడించేందుకే.. పొత్తులు అనే ప్రాతిపదికను ఎంపిక చేసుకున్న పవన్.. రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా? అని అనిపించారు. ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా.. పవన్‌కు చేరువ అవుదామని భావించిన కాపు లను ఆయన పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు చిత్రంగా వారికే చేరువ అయ్యే ప్రయత్నాలు ప్రారంభించా రు. వ్యక్తిగత జీవితమైనా.. రాజకీయ వ్యవహారమైనా.. నమ్మకం.. అనే మాటపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకమే ఇప్పుడు జనసేన కోల్పోయిన కోల్పోతున్న ప్రధాన విషయం.
నిజానికి బలమైన అభిమాన గణం.. యువత అండగా ఉన్న పవన్.. ఒంటరిగా ఎందుకు నిలబడలేక పోతున్నారనేది కీలక అంశం. గత ఎన్నిలకలకు ముందు.. తర్వాత.. ఆయన వేసిన అడుగులు మరింత విస్మయాత్మకం. బీజేపీని వద్దని.. ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీని కలుపుకొని వెళ్లారు. కానీ, తర్వాత బీజేపీకి చేరువయ్యారు. చంద్రబాబు అనుంగుగా.. ముద్రవేసుకున్నారు. ఆయన నడిపిస్తున్నారనే వాదనను బలంగా తెచ్చుకున్నారు.
వెరసి ఎలా చూసుకున్నా.. పవన్.. ఇప్పటి వరకు ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే. ప్రజాక్షేత్రంలో బలమైన వర్గాన్ని సృష్టించుకోవడం కానీ, క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే వ్యూహం కానీఆయనలో ఇప్పటికీ కనిపించకపోవడం దారుణం. మరి వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు నిర్వహిస్తున్న 10వ ఆవిర్భావ సదస్సులో అయినా.. పార్టీకి.. తనకు ఒక దశ-దిశ ఏర్పాటు చేసుకుంటారో లేదో చూడాలి.