జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిలబడి తమ పార్టీని నిలబెట్టడమే కాకుండా నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టిడిపిని కూడా నిలబెట్టామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి నేతను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
12 ఏళ్ల ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించానని, ఓడిపోయినా అడుగు ముందుకే వేశామని అన్నారు. 2019లో జనసేన ఓడినప్పుడు మీసాలు మెలేసి జబ్బలు చరిచారని, తొడలు కొట్టారు, మన ఆడపడుచులను అవమానించారని గుర్తు చేసుకున్నారు. జనసైనికులు, వీరు మహిళలపై కేసులు పెట్టి జైళ్లలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే అహంకారంతో విర్రవీగిన వైసీపీని 11 ఏళ్ల ప్రస్థానం ఉన్న జనసేన 11 సీట్లకి పరిమితం చేసిందని అన్నారు.
అసెంబ్లీ గేటు కూడా తాకలేవని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడలను బద్దలు కొట్టామని, అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతో, పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతో అడుగుపెట్టామని అన్నారు. దేశం అంతా తలతిప్పి చూసేలా 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించి జయకేతనం ఎగరేస్తున్నామని పవన్ ప్రసంగించారు.