నచ్చినోడు మనోడైతే బంతి చివరన కూర్చున్న అన్ని ఐటెమ్ లు వరుస పెట్టి వస్తాయన్న మాట జగన్ సర్కారు విషయంలో అతికినట్లుగా సరిపోతుంది. తనకు నచ్చిన వారికి.. తాము మెచ్చిన వారి విషయంలో ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే జగన్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం పోలీసు వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పోచా వరుణ్ రెడ్డి ఎవరు? అన్న సందేహం రావొచ్చు. ఆయన పేరుతో కాకుండా ఆయన విధులు నిర్వహించిన వేళలో చోటు చేసుకున్న ఉదంతాలు చెబితే ఆయన ఇట్టే గుర్తుకు వచ్చేస్తారు.
టీడీపీ నేత కమ్ మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను అనంతపురం జైల్లో దారుణ హత్యకు గురి కావటం.. అప్పట్లో పలు సందేహాలకు తావిచ్చింది. ఈ సంచలన హత్య జరిగిన సమయంలో జైళ్ల శాఖ అదనపు సూపరింటెండెంట్ గా వ్యవహరించారు పోచా వరుణ్ రెడ్డి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. పర్యవేక్షణ సరిగా లేకపోవటం.. భద్రతాపరమైన అంశాల్ని పట్టించుకోకపోవటం లాంటి వైఫల్యాలే మొద్దు శీను హత్య జైల్లో జరగటానికి కారణమైందన్న కారణంతో ఆయనకు పనిష్మెంట్ విధించారు. విధుల నుంచి తొలగించారు.
కట్ చేస్తే.. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే ఆయనకు విధించిన పనిష్మెంట్ ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాజాగా అదే అధికారికి కీలక బాధ్యతలు అప్పగించిన వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. ఉమాశంకర్ రెడ్డి.. సునీల్ యాదవ్ రిమాండ్ లో ఉన్న కడప కేంద్ర కారాగారం ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ గా పోచా వరుణ్ రెడ్డి బాధ్యతలు అప్పగించటం ఆసక్తికరంగా మారింది.
పోచా వరుణ్ రెడ్డి కెరీర్ లో వివాదాలు ఆయన చుట్టూనే తిరుగుతుంటాయన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఆయన మదనపల్లె సబ్ జైలు సూపరింటెండెంట్ గా పని చేస్తున్న సమయంలో ఎస్. వెంకటరమణ అనే వ్యక్తిని కొన్ని నెలల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారంటూ ఆరోపనలు ఉన్నాయి. అప్పట్లో ఆయనపై మోపిన అభియోగాలు నిరూపణ కాలేదని విచారణ అధికారి తేల్చారు.
ఈ నివేదికను అప్పటి జైళ్ల శాఖ డీజీ అసంత్రప్తి వ్యక్తం చేసి.. ఆమోదించలేదని చెబుతారు. ఈ సందర్భంగా ఇంక్రిమెంట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తూ పనిష్మెంట్ ఇచ్చారు. 2011లో అప్పటి ప్రభుత్వం ఆ ఆదేశాల్ని కొట్టేసింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేయటమే కాదు.. ఆయన సస్పెన్షన్ లో ఉన్న కాలాన్ని సైతం డ్యూటీలోనే ఉన్నట్లు పరిగణలోకి తీసుకోవాలని పేర్కొనడం షాకింగ్ గా మారింది. పోచాపై ఇంత ప్రేమ ఏమిటన్నచర్చ పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.