తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్లోనే పొరుగు తెలుగు రాష్ట్రంతో పాటు ఏపీలో కూడా శాసనసభ ఎన్నికలు ముందస్తుగా జరిగే ఛాన్స్ ఉందని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఊహగానాలకు తెరతీశాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఆ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేకపోవడంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్ ఏ క్షణంలో అయినా ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, హఠాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రతిపక్ష పార్టీలను అయోమయానికి గురి చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వచ్చింది. గతంలో తెలంగాణలో కేసీఆర్ కూడా ఇదే ఫార్ములాను అనుసరించి ప్రతిపక్షాలకు ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయం ఇవ్వలేదని, ఆ రకంగా ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారని, అదే ఫార్ములాను జగన్ కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని జగన్ క్లారిటీనిచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో జగన్ మంత్రులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని జగన్ చెప్పారు. ఈ తొమ్మిది నెలలు కష్టపడితే మరోసారి వైసీపీదే విజయం అని మంత్రులకు ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు జగన్.
చంద్రబాబు మినీ మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన పనిలేదని జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లడంపై ఫోకస్ చేయాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు.