అధికారంలో లేనప్పుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. నాయకుల `టంగ్` ఎన్ని వంకర్లయినా తిరుగు తుందని అనడానికి ఏపీ సీఎం జగన్.. ఆయన కేబినెట్ మంత్రులే ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడ్డారు. సరే! ఇది ఆయన డ్యూటీ అనుకున్నారు అందరూ. కానీ, అవే విషయాలపై ఇప్పుడు మాత్రం.. టంగ్ మార్చేశారు! ఆయన ఒక్కరే కాదు.. జగన్ కేబినెట్ మంత్రి, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా ఇదే సూత్రం పాటిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన పేదలకు, ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-జూలై.. ఉచితంగా రేషన్ మంజూరు చేస్తోంది. అంటే.. రాష్ట్రం ఇచ్చే కోటా కాకుండా.. కేంద్రంలోని మోడీ సర్కారు కూడా పేదలకు ఉచితంగానే బియ్యం, గోధుమలు, నూనె, కందిపప్పు (అరకి లో).. వంటివి సరఫరా చేస్తోంది.
అయితే.. కేంద్రం ఇస్తున్న ఈ కోటాను కూడా తమ లెక్కలోనే కలిపేసుకు న్న కొడాలి నాని.. “రేషన్ కార్డు దారుల్లో ప్రతి ఒక్కరికీ 10 కేజీల బియ్యం.. 5 కేజీల గోధుమలు పంపిణీ చేస్తున్నాం“ అని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి.. ఈ పంపిణీలో సగం రాష్ట్రం ఎప్పటిలాగా ఇస్తున్నవి కాగా.. మిగిలిన సగం కేంద్రం ఇస్తున్నవి. అయినప్పటికీ.. మొత్తం కలిపి.. తమ కోటాలోనే వేసేసుకున్నారు జగన్ పరివారం.
ఇక, పేదలకు ఇళ్లు పథకం కింద.. రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెబుతున్న సీఎం జగన్.. ఈ ఇళ్లలో కేంద్రం నుంచి వచ్చే సొమ్మును వాడుకుంటున్న మాట వాస్తవం.
దీనికి సంబంధించి అంటే.. కేంద్రం కట్టిస్తున్న వివిధ పథకాల కింద ఇళ్లకు.. దీనికి అనుమతి ఇవ్వాలంటూ.. సీఎం జగనే నేరుగా ప్రధాని రెండు నెలల కిందట లేఖ రాశారు.
అంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని చెబుతున్న పేదలందరికీ ఇళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. అయినప్పటికీ.. అంతా మేమే చేస్తున్నామని.. సీఎం జగన్ చెప్పుకోవ డం అందరికీ తెలిసిందే.
ఇక, ఇదే విషయంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుద్దులు చెప్పిన జగన్.. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చేది కూడా తన ఖాతాలో కలుపుకొని మేళ్లు చేస్తున్నామని చెప్పుకోవడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. జగనన్నా ఇదేం పద్ధతి! అంటున్నారు.