- చిన్న పరిశ్రమలకు భలే ప్రోత్సాహకం!
- రూ.1,124 కోట్లకు 450 కోట్లే మంజూరు
- అందులోనూ పైసా కూడా ఇవ్వని వైనం
బటన్ నొక్కి పారిశ్రామిక రాయితీలు విడుదల చేసేశాం.. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల కింద రూ.450 కోట్లు వేసేశాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలే అందులో 62శాతం మంది ఉన్నారు…అని ముఖ్యమంత్రి జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా కోట్ల రూపాయలతో పత్రికా ప్రకటనలు ఇచ్చి.. ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటుచేసి బటన్ నొక్కారు. కానీ ఇప్పటివరకు ఎంఎస్ఎంఈల ఖాతాల్లోకి ఆ డబ్బులు పడలేదు. సాధారణంగా బటన్ నొక్కిన 24 గంటల్లో డబ్బులు జమవుతాయి. ముఖ్యమంత్రి మూడో తేదీన బటన్ నొక్కారు. అంటే నాలుగో తేదీకల్లా డబ్బులు జమ కావాలి. కానీ 14వ తేదీకి కూడా విడుదల కాలేదు.
ప్రోత్సాహకాలతోనైనా సమస్యల సుడిగుండం నుంచి బయటపడదాం అని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల యజమానులకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఒకపక్క నెలవారీ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల చెల్లింపు చేయలేక.. ప్రోత్సాహకాలు వస్తాయి.. అందులో నుంచి తీసేసుకోండని రెండు నెలల నుంచి వాటికి చెబుతున్నారు.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 26వ తేదీన ప్రోత్సాహకాలు విడుదల చేస్తామని తొలుత ప్రకటించింది. దీంతో ఆగస్టు వాయిదాను ప్రోత్సాహకాలు వచ్చిన వెంటనే తీసేసుకోండని పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ఆగస్టులో ప్రోత్సాహకాలు రాలేదు. సెప్టెంబరు మూడున ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేసేసింది.
ఇక మీ రుణ వాయిదాలకు ఇబ్బంది ఉండదని పారిశ్రామికవేత్తలు వాటికి ధీమాగా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి బటన్ నొక్కినా ఇంకా డబ్బులు మాత్రం ఖాతాల్లోకి రాలేదు. ఇదే కాదు.. విద్యుత బిల్లులు చెల్లిస్తే తప్ప ప్రోత్సాహకాలకు అర్హులు కాదని మెలిక పెట్టడంతో.. అప్పో సప్పో చేసి ఎంఎస్ఎంఈ యూనిట్ల యజమానులు వాటిని కట్టేశారు.
గ్రానైట్ యూనిట్లు ఉన్నవారైతే దాదాపు రూ.10లక్షల వరకు విద్యుత బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఇంకా చిన్న యూనిట్‌దారులు కూడా కనీసం రూ.70వేల నుంచి రెండు లక్షల వరకు విద్యుత బిల్లులు చెల్లించారు. అసలే కరోనా.. తగ్గిన సరుకు డిమాండ్ నేపథ్యంలోనూ ప్రోత్సాహకాలు వస్తే ఏదోరకంగా పరిశ్రమను ముందుకు నడిపిద్దామన్న ఉద్దేశంతో అందినకాడికి అప్పులు చేసి ఈ విద్యుత బిల్లులు కట్టారు. కానీ ఇప్పుడు సీఎం బటన్ నొక్కినా ఇప్పటికీ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇందులోను అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్దిదారులే ఉన్నారు.
నిధుల్లేక!
వాస్తవానికి ఇప్పుడు ప్రోత్సాహకాల జాబితాలో అనుమతి పొందిన ఎంఎస్ఎంఈ యూనిట్‌దారులకు గత ఏడాదే ప్రోత్సాహకాలు రావాల్సి ఉన్నా రాలేదు. కొవిడ్ ఎదురవడంతో వీరంతా అల్లాడిపోయారు. అయినా ఏదోరకంగా తిప్పలు పడుతూ పరిశ్రమలను నడిపించారు.
ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేశామని చెప్పాక కూడా ప్రోత్సాహకాలు పడకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. దీనిపై పరిశ్రమల శాఖ అధికారులను అడిగితే రకరకాల సమాధానాలు వస్తున్నాయి. సీఎఫ్‌ఎంస్‌లో సమస్య అని ఒకసారి, కొద్దిరోజుల్లో పడిపోతాయని ఇంకోసారి చెబుతున్నారు. అనధికారికంగా మాత్రం నిధులు లేవని చేతులెత్తేసినట్లు తెలిసింది.
చేతిలో డబ్బు లేనప్పుడు ఇస్తామని ఎందుకన్నారు.. సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలు ఎందుకిచ్చారన్నది ప్రశ్న. నిజానికి ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అందులోనూ కోతపెట్టింది. రూ.680 కోట్లు మాత్రమే విడుదల చేసి.. మిగ తా రూ.444 కోట్లను భవిష్యతలో ఆయా పరిశ్రమలు చెల్లించే విద్యుత బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని మెలిక పెట్టింది.
ఆ 680 కోట్లలోనూ రూ.450 కోట్లు నేరుగా ఎంఎస్ఎంఈల ఖాతాల్లోకి వె ళ్లాయని.. టెక్స్టైల్స్ మిల్స్‌కు కూడా రూ.230 కోట్లు బటన్ నొక్కి విడుదల చేశామని సీఎం చెప్పారు. అయితే మిల్స్‌కు మాత్రం విద్యుత బిల్లుల్లో సర్దుబాటు చేస్తామన్నారు.